స్టేట్ అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు వీరే
రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా పలువురు జర్నలిస్టులను ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే 2023-24 సంవత్సరాలకు సంబంధించి నూతన అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పుడు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులను నియమిస్తోంది.
ముందుగా రాష్ట్ర కమిటీలో ప్రింట్ మీడియా తరుపున రమణమూర్తి (సాక్షి), దారా గోపి (టైమ్స్ ఆఫ్ ఇండియా) జి.గీతాంజలి (ఇండియన్ ఎక్స్ ప్రెస్) పి.సుజాత వర్మ (ద హిందూ),లను నియమించారు. చిన్నపత్రికల తరుపున కె.బాలగంగాధర్ తిలక్ (స్వర్ణాంధ్ర), బత్తుల రాకుమారి (నేటి తెలుగుపత్రిక)లను, ఎలక్ర్టానిక్ టీవీ ఛానెళ్ల తరుపున ఎన్.సతీష్ (సాక్షి టీవీ), రెహనా బేగం (ఎన్.టివీ) హసీనా షేక్ (టివి9) వంజా రుబేన్ (సాక్షి,ఫోటోగ్రాఫర్)లను నియమించింది. వీరు కాకుండా లేబర్ డిపార్ట్‌మెంట్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, హౌసింగ్ బోర్డు సౌత్ సెంట్రల్ రైల్వే, ఎపిఎస్ఆర్‌టిసీ, ఐ&పిఆర్ అడిషన్‌ల్ డైరెక్టర్, సిఐపిఆర్, జాయింట్ డైరెక్టర్ (మీడియా రిలేషన్స్)లు కమిటీలో ఉంటారు.
ఈ కమిటీకి ఐ&పిఆర్ కమీషనర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అయితే జర్నలిస్టుల నియామకంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో జర్నలిస్టులను కమిటీలో సభ్యులుగా నియమించేవారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం నేరుగా తమకు నచ్చిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించింది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా నూతనంగా అక్రిటేషన్ మంజూరు కోసం విధించిన నియమ, నిబంధనలపై కూడా విమర్శలు వస్తున్నాయి.
మొత్తం మీద వైకాపా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జర్నలిస్టుల అక్రిటేషన్‌పై ప్రతి ఏడాది ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. జర్నలిస్టులకు కనీసం సంక్షేమాన్ని ప్రభుత్వం అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కోవిద్‌తో చనిపోయన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. దీనిపై జీవోను కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకూ కోవిద్‌తో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒక్కరికీ సహాయం చేయలేదు. అక్రిటేషన్ కమిటీల విషయంలో ప్రభుత్వం తలదూర్చి లేనిపోని వివాదాలను రేపినట్లుయింది. ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని సంఘాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నాయి. తమ హక్కు అయిన అక్రిడిటేషన్‌పై ప్రభుత్వ పెత్తనం ఏమిటని వారు అంటున్నారు. గత ఏడాది అసలు జర్నలిస్టులను కమిటీలోకి తీసుకోకుండా అక్రిటేషన్లు మంజూరు చేయడంపై విమర్శలు రావడంతో ఇప్పుడు నామమాత్రంగా వారికి కమిటీలో చోటుఇచ్చి, అధికారం తమ చేతిలో పెట్టుకున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
Comments