మార్కెట్‌లోకి మళ్లీ వస్తున్న ఒకప్పటి అంబాసిడర్ కార్.. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..?
అప్పట్లో.. అంటే 1970, 1980లలో హిందూస్థాన్ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్ కారు ఒక ఊపు ఊపింది. కార్ మార్కెట్‌లో ఈ కార్లది అప్పట్లో 75 శాతం వాటా. ఈ విషయం ఒక్కటి చాలు.. అప్పట్లో అంబాసిడర్ కార్లు ఎంతటి ఆదరణను పొందాయో చెప్పడానికి. అయితే మార్కెట్‌లోకి మారుతి సుజుకితోపాటు ఇతర కారు సంస్థలు రావడం.. ఆధునిక ఫీచర్లతో కార్లను తయారు చేసి అందించడంతో.. అంబాసిడర్ కారుకు రాను రాను ఆదరణ తగ్గింది. అప్పట్లో దీన్ని రాజకీయ నాయకులు ఎక్కువగా వాడేవారు. అయితే అంబాసిడర్ కారు త్వరలోనే మళ్లీ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఈ మేరకు హిందూస్థాన్ మోటార్స్ ప్రణాళికలు రచిస్తోంది.
చివరి అంబాసిడర్ కారును 2014లో డెలివరీ చేయగా.. అప్పటికే కంపెనీ తీవ్రమైన నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో అంబాసిడర్ బ్రాండ్‌ను గ్రూప్ పీఎస్‌ఏ అనే కంపెనీకి విక్రయించారు. అయితే ఇప్పుడు సీకే బిర్లా గ్రూప్ అనే సంస్థతో హిందూస్థాన్ మోటార్స్ భాగస్వామ్యం అయింది. దీంతో త్వరలోనే అంబాసిడర్‌ను మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
కారు డిజైన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత అంబాసిడర్‌లోని ఫీచర్లతోపాటు లుక్‌ను కూడా కొత్త డిజైన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. వీటిని ఒక ఆర్టిస్టు ఊహించి రూపొందించాడు. కనుక ఇప్పటికైతే డిజైన్ పరంగా ఇవి అనధికారిక ఫొటోలే అని చెప్పవచ్చు. కాగా కొత్త మోడల్‌ను ఎలక్ట్రిక్ వేరియెంట్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అందులో నలుగురు కూర్చుని వెళ్లేలా సీటింగ్ సామర్థ్యం ఉంటుందట. దీంతోపాటు 1200 సీసీ ఇంజిన్, 5 ఆటోమేటిక్ గేర్స్, ఇతర ఆధునిక సదుపాయాలు కొత్త అంబాసిడర్ లో ఉంటాయని తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Comments