ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఈనెల 4న కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలను సీఎం జగన్ ప్రారంభించారు. కొత్త జిల్లాల నుంచి పాలన మొదలైనా, ఇప్పటికీ కొన్ని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. తమకు ప్రత్యేక జిల్లా కావాలంటూ పలు ప్రాంతాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశముందని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాలతోనే ఈ జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు పూర్తిగా గిరిజన ప్రాంతాలతోనే ఉన్నాయి. తాజాగా గిరిజన ప్రాంతాలతోనే మరో జిల్లా ఏర్పాటుకానుందట. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశముందని పేర్ని నాని అన్నారు.
మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అంటే రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ ప్రాంతాలతో జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాలు పాడేరులో ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దీంతో మన్యం ప్రాంతంలో మరో జిల్లా వచ్చే అవకాశమున్నట్లు పేర్ని నాని అన్నారు.
Comments