తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఏ
హైదరాబాద్, తెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు..
మావోయిస్టు సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఐఏ ప్రకటన విడుదల చేసింది. ముచింగిపట్టు మావోయిస్టు కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు పేర్కొంది. ఒకరిని అరెస్టు చేయగా.. ఆయుధాలు, నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
''తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల తనిఖీలు చేశాం. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నర్సింహులును అరెస్టు చేశాం. తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. కడపలో రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నాం. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించాం. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, ఏలూరు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లో సోదాలు జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హనుమకొండ, ఆదిలాబాద్‌లో జిల్లాల్లో సోదాలు చేశాం. సీఎల్‌సీ, ఏబీఎంసీ, సీఎంఎస్, కేఎన్‌పీఎస్, పీడీఎం, పీకేఎస్, పీకేఎం, ఆర్‌డబ్ల్యూఏ, హెచ్‌ఆర్‌ఎఫ్, సీఆర్‌పీపీ, ఐఏపీఎల్ నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిపాం. మావోయిస్టు అనుబంధ సంఘాల నాయకులు మవోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఆధారాలున్నాయి'' అని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది.
Comments