మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పాత ఆటోనగర్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్ పాత ఆటోనగర్ లోని ది ప్రొద్దుటూరు ఆటో నగర్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వి.ఎస్ ముక్తియర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, తమ పంచాయతీ పరిధిలోని పాత ఆటోనగర్ నందు మౌలిక వసతులు త్వరలో సమకూరుస్తామని అసోసియేషన్ వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అజ్మత్ మాట్లాడుతూ, 1996వ సంవత్సరంలో ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేయటం జరిగిందని, అయితే అప్పటి నుండి ఇక్కడ సరైన మౌలిక వసతులు లేకపోవడం, రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వలన వర్షాలకు గుంతులు ఏర్పడి ఇక్కడ మరమ్మత్తులకు వచ్చే భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి కార్మికులకు పనులు కరువయ్యాయని, దుమ్ము ధూళి వ్యాపించి శ్వాస సంబంధిత వ్యాధులకు కార్మికులు గురికావలసి వస్తోందని, గతంలో ఈ సమస్యలను అప్పటి ఎమ్మెల్యేలకు సర్పంచులకు విన్నవించినా ఫలితం లేకపోవడం వలన నేడు ఇక్కడి వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజులలో ఆయనా సమస్య జటిలతను తెలుసుకొని వాటిని పరిష్కరించవలసినదిగా నాయకులను విజ్ఞప్తి చేశారు.
Commentaires