కేంద్రం నిర్ణయం లో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగులు భూములను అమ్మకానికి వ్యతిరేకించండి అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. దీనికి వ్యతిరేకంగా నేడు స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్య రామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తను తాబేదార్లు కట్టబెట్టాలన్న కృతనిశ్చయంతో ఉందని అందులో భాగంగానే మిగులు భూములను అమ్మకానికి పెట్టిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజకీయంగా ఎదిరించే వారు లేరన్న అహంకారంతో కుతంత్రాలు పన్ని దేశ సంపద అయిన విశాఖ ఉక్కు పై జరుగుతున్న కుయుక్తులను ఐక్య ఉద్యమాలతోనే ప్రతిఘటన కు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సకాలంలో విస్తరణకు అనుమతులు ఇచ్చి అనేక మంది నిర్వాసిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆయన అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్య ప్రతిఘటనలు మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఐక్య నినాదాన్ని మరింత ఉధృతం చేయాలని వారు అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాటిలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు వై టి దాస్, గంధం వెంకట్రావు, కె సత్యనారాయణ రావు, దొమ్మేటి అప్పారావు, బొడ్డు పైడిరాజు, దాలి నాయుడు, వి రామ్ మోహన్ కుమార్, డి వి రమణ రెడ్డి, వరసాల శ్రీనివాస్, డి సురేష్ బాబు, బి డేవిడ్, జి ఆర్ కె నాయుడు తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
Comments