అమరవీరులకు సెల్యూట్ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
మనందరి సైనికులే పోలీసులని.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. ఏపీ పోలీసుల తరపున గౌరవ వందనం స్వీకరించారు సీఎం జగన్. అనంతరం ప్రసంగిస్తూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా.. అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఏపీ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. గత సంవత్సర కాలంలో ఏపీ నుంచి విధి నిర్వహణలో పదకొండు మంది పోలీసులు అమరులయ్యారని ఈ సందర్భంగా ప్రకటించారు.
విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మరోసారి తెలియజేశారు. పోలీసులపై ఒత్తిడికి తగ్గించేందుకు.. పోలీస్ నియామకాల భర్తీ చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో 6,511 పోస్టుల భర్తీతో పాటు.. హోంగార్డుల భర్తీలో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు.
తమ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థలో మార్పులొచ్చాయన్న సీఎం జగన్.. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు అందులో భాగమేనని తెలియజేశారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, పోలీస్ శాఖలోనే 16వేల మంది మహిళా పోలీసులను నియమించామని ఆయన గుర్తు చేశారు.
మహిళలు, దళితులను పోలీస్ శాఖ(హోం శాఖ)కు మంత్రులుగా నియమించి.. వాళ్లకు ప్రాధాన్యం విషయంలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని మన ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని సీఎం జగన్ తెలియజేశారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలీస్ శాఖకి సంబంధించిన వీక్లీ ఆఫ్ ఇవ్వాలన్నది తన అభిమతమని, అయితే.. సిబ్బంది కొరతతో అది పూర్థిస్థాయి ఆచరణలకు నోచుకోవడం లేదని తేలినందునే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. పోలీస్ సిబ్బంది సమస్యలన్నింటిని తప్పకుండా పరిష్కరిస్తామని సీఎం జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments