Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
కడప జిల్లా విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి తేవడం కోసం, 1959 వ సంవత్సరంలో ప్రొద్దుటూరు పట్టణం, కొర్రపాడు రోడ్డులోని దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో పాలిటెక్నిక్ కళాశాల స్థాపించబడింది. మొదట 3 బ్రాంచ్ లతో ప్రారంభించి, నేడు మొత్తం 5 బ్రాంచ్ లలో దాదాపు 1600 మంది విద్యార్థులతో రాయలసీమ లో ప్రముఖ కళాశాలగా విరాజిల్లుతోంది. ఇందులో ప్రస్తుతం 49 మంది అధ్యాపక సిబ్బంది మరియూ 29 మంది అధ్యాపకేతర సిబ్బంది పనిచేయుచున్నారు.
గత పది సంవత్సరాలుగా కళాశాల పూర్వ విద్యార్థులు, తమ తమ బ్యాచ్ మిత్రులందరితో కళాశాల ప్రాంగణంలో కలిసి పూర్వ విద్యార్ధుల సమావేశాలను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఆ ప్రోత్సాహంతో, కళాశాల ఆరంభం నుండీ, నేటివరకూ కళాశాల పూర్వవిద్యార్థులతో ఒక భారీ సమావేశం (Grand Alumni Meet) యేర్పాటు చేయాలనే తలంపు కలిగింది. ఈ గురుతర బాధ్యతను, కళాశాల సివిల్ బ్రాంచ్ హెడ్ గా పనిచేస్తున్న మరియూ ఇదే కళాశాల పూర్వ విద్యార్థి అయిన శ్రీ గురుమూర్తి రెడ్డి గారు తమ భుజస్కంధాలపై వేసుకొని, గత రెండు నెలలుగా శ్రమించి, దాదాపు 1500 మంది పూర్వ విద్యార్థుల వివరాలు సేకరించి, వారందరినీ ఒక త్రాటి పైకి తెచ్చి, నేడు జరుపుకుంటున్న ఈ అఖండ పూర్వ విద్యార్ధుల సమ్మేళనానికి ముఖ్య కారకులయ్యారు.
ఈ కళాశాల పూర్వ విద్యార్థులు, నేడు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో స్థిరపడి వున్నారు. వారందరూ తాము చదువుకున్న కళాశాల పట్ల వారికి గల కృతజ్ఞతా భావంతో కొంత ఆర్థిక సహకారం అందించడానికి స్వయంగా ముందుకు రావడంతో, చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యల పరిష్కరానికి వెసులుబాటు కలిగింది. కళాశాల నిర్మాణాల జీవితకాలం దాదాపు ముగింపు దశకు చేరిన ఈ సమయంలో, కొత్త నిర్మాణాలు పూర్తయ్యే వరకూ, ప్రస్తుతం విద్యార్ధుల సౌకర్యార్థం కొన్ని అత్యవసర పనులు చేపట్టవలసిన ఆవశ్యకం ఏర్పడింది. పెచ్చులూడుతున్న క్లాస్ రూమ్ పైకప్పులు, వర్షాకాలంలో జలమయం అవుతున్న ఆవరణం, దురాక్రమణకు గురవుతున్న కళాశాల ప్రాంగణం, పనిచేయని ఫ్యాన్లు, వర్షాలకు కురుస్తున్న లాబొరేటరీలు, పనిముట్ల కొరత.. ఇలా పలు సమస్యల పరిష్కారం కోసం, పూర్వ విద్యార్థులు ఇతోధికంగా ఆర్థిక సహకారం అందించగా, ప్రిన్సిపాల్ గారు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా ఈ పనులన్నింటినీ ప్రణాళికా బద్ధంగా కొంతమేరకు పూర్తి చేయగలిగారు. ఇందులో ప్రధానంగా, మెయిన్ రోడ్డు వెంబడి chain link ఫెన్సింగ్ ఏర్పాటు, ఆవరణంలో తారు రోడ్డు నిర్మాణం, క్లాస్ రూం లందు safety ceiling ఏర్పాటు, కొత్త ఫ్యాన్లు, క్లాస్ డెస్కులు, పనిముట్లు కొనుగోలు.. ఇంకా మరెన్నో మరమ్మత్తు పనులు పూర్తి చేయటం జరిగింది.
నేడు జరుపుకుంటున్న ఈ Grand Alumni Meet కు రాష్ట్రం నుండే కాకుండా, దేశంలో నలు వైపుల నుండి ఎంతో ఉత్సాహంతో పూర్వ విద్యార్థులు పాల్గొనబోతున్నారు.
Comments