పోరంబోకు స్థలానికై వివాదం, ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మండల పరిధిలోని డి బి ఎన్ పల్లె అరుంధతి వాడలో రోడ్డు పోరంబోకు స్థల వివాదం రాజకీయ రంగు పులుముకుంది. డిబిఎన్ పల్లె అరుంధతి వాడ పరిధిలో సర్వే నెంబర్ 174 లో రాజంపేట పట్టణానికి చెందిన జాఫర్ వల్లి ఖాన్ అనే వ్యక్తి 1995లో 18.745 సెంట్లు మురళి అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. 28 సంవత్సరాలుగా ఉన్న ఆ జాగాను విక్రయించే ప్రయత్నంలో రోడ్డు పోరంబోకు స్థలాన్ని 13 అడుగుల మేర ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఆ గ్రామ దళితులు అడ్డుకున్నారు. శనివారం మండల సర్వేయర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జాగాను సర్వే చేపట్టారు. గ్రామస్తులంతా మూకమ్మడిగా తమకు రోడ్డు నుంచి 13 అడుగుల మేర పోరంబోకు స్థలం ఉందని, ఆ జాగా వదిలేసి సర్వే నిర్వహించాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే అనుచరులు ఇందులో ప్రముఖ పాత్ర వహిస్తూ దళిత గ్రామంలోని పోరంబోకు స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ పూర్వీకుల కాలం నుంచి రోడ్డు నుంచి 13 అడుగుల జాగా తమకు ఉందని., అధికార బలం, రాజకీయ బలంతో తమకు అన్యాయం చేస్తే సహించేది లేదని గ్రామస్తులు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. రోడ్డు నుంచి మూడు అడుగులు మాత్రమే వదులుతామని ఎమ్మెల్యే అనుచరులు పట్టుబట్టి కూర్చోవడంతో ఇద్దరి మధ్యన వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారకముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comentarios