అంగబలం అర్థబలం మాకు ఉందని రుజువు చేయగలం - పి.పి జయకుమార్
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
చట్టసభలలో ప్రాతినిథ్యం వహించడానికి క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించాలని, అంగభలం, అర్థబలం తమకూ ఉందని ఓటరు గానే కాక నాయకులుగా తమను గుర్తించి సీట్లు కేటాయించాలని రిటైర్డ్ సివిల్ ఇంజనీర్, మాజీ సీఎస్ఐ టౌన్ చర్చ్ సెక్రటరీ పిపి జయకుమార్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జయకుమార్ మాట్లాడుతూ, క్రిస్టియన్ మైనారిటీల ప్రాతినిధ్యం చట్టసభలలో పూర్తిగా కరువైనదని, ఎక్కడా కూడా క్రిస్టియన్ మైనారిటీలకు తగిన ప్రాధాన్యత లభించటం లేదని, దామాషా ప్రకారం నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులకు మైనారిటీ కోటాలో సీట్లు కేటాయించినట్లు, క్రిస్టియన్ మైనారిటీలకు కూడా వాటా కేటాయించవలసిందిగా కోరారు. అన్ని రాజకీయ పార్టీలు వీటిని అమలు పరచటంలో వైఫల్యం చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత సామాజిక న్యాయమని చెబుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా క్రిస్టియన్ మైనారిటీలకు కేటాయించలేదని, బడుగు బలహీన వర్గాల పార్టీగా పేరుందిన కాంగ్రెస్ పార్టీలో కూడా, ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల క్రిస్టియన్ మైనారిటీలను గుర్తించకపోవడం తమన ఎంతో బాధిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గ నాయకుని కనుసన్నల్లోనే షర్మిలమ్మ బస్సుయాత్ర కొనసాగుతోందని, ఈ విషయాన్ని ఇప్పటికైనా వైయస్ షర్మిల గుర్తించాలని కోరారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిత్వానికి తాను పోటీ చేయదలుచుకున్నట్లు, తన అభ్యర్థనను ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పరిశీలించాలని కోరారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బాలాజీ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కడప జిల్లాలోని జమ్మలమడుగు అలాగే ప్రొద్దుటూరులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లు ఎక్కువగా ఉన్నారని ఈ ప్రాతిపదికన వైయస్ షర్మిల ఈ రెండు స్థానాలలో సరైన నిర్ణయం తీసుకొని అభ్యర్థిని ప్రకటించాలని కోరారు.
Comentarios