అధికారులు తీరు మార్చుకొనకపోతే రెడ్ బుక్ లోకి పేర్లు - ప్రవీణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ కడప జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక కడప జిల్లాకు చేరుకోవటం హాస్యాస్పదంగా ఉందని, జిల్లాకు ఒక చిన్న పరిశ్రమ కూడా ఆయన హయాంలో దక్కలేదని ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ, రానున్న రోజులలో వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేపడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు? అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ వైసిపి ఓటమి తనకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చిందని, నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలపై ఇష్టానుసారంగా దాడులు చేయించి తప్పుడు కేసులు నమోదు చేయించారన్నారు. తనపై కూడా అక్రమ కేసులు బనయించడమే కాకుండా, రెండుసార్లు జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. వైసీపీ నాయకులకు ప్రజా శ్రేయస్సు సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయని, సంవత్సరం రోజుల వరకు ప్రజా సమస్యలపై ప్రశ్నించను అన్న రాచమల్లు వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, ప్రజా సమస్యలపై నాయకులు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తే తప్పు లేదని అభిప్రాయపడ్డారు.
అలాగే ప్రొద్దుటూరులోని పోలీసు అధికారులు, పలు శాఖల అధికారులు ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఆయన బావమర్ది పాతకోట బంగారు మునిరెడ్డికి వత్తాసు పలుకుతూ, ఇసుక అక్రమ రవాణాలో సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ, త్వరలో వారి పేర్లు లోకేష్ వద్దనున్న రెడ్ బుక్ నందు పొందుపరచనున్నట్లు హెచ్చరించారు. అధికారులు తమ తీరు మార్చుకొనకపోతే వారి కార్యాలయాల వద్దకు వచ్చి తానే ప్రశ్నిస్తానని హెచ్చరిస్తూ, ఇకపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ బాబుకు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు అధికారులు మానుకోవాలని సూచించారు. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్న తనను ఏ సమయంలోనైనా కలవవచ్చునని వారి సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేస్తానని ప్రవీణ్ హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Kommentare