ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు నన్ను బాధిస్తున్నాయి - ప్రవీణ్ రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కన్న తల్లిపై పత్రికాముఖంగా చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధిస్తున్నాయని, సభ్యసమాజం తలదించుకునేలా, ముఖ్యంగా మహిళ లోకాన్ని కించపరిచేలా ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు ఉన్నాయంటూ ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే రాచమల్లు మాటలను తప్పుగా భావిస్తున్నానని, ప్రొద్దుటూరు మహిళలు అందరి తరపున ఎమ్మెల్యే తల్లిని క్షమాపణలు కోరుతున్నానని, రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓట్ల కోసం కన్న తల్లినే అలా మాట్లాడటం సబబు కాదని హితువు పలికారు. ఇలాంటి మాటలు ఎవరికైనా అభ్యంతరకరమైనవని, దైవ సమానురాలైన తల్లిని ఎమ్మెల్యే రాచమల్లు రాజకీయ లబ్ధి కోసం వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేయటం తగదంటూ ఇకనైనా ఇలాంటి మాటలు మానుకోవాలని, ఇకపై తన గురించి కానీ, తన కుటుంబ సభ్యుల గురించి కానీ, తన వ్యాపారాల గురించి కానీ ఎమ్మెల్యే మాట్లాడితే సహించబోనని చివరి హెచ్చరిక జారీ చేశారు. సొంత పార్టీలోనే వైసీపీ నాయకులు ఎమ్మెల్యే రాచమల్లు పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్న నేపథ్యంలో, నిన్నటి ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు పెను దుమారమేలేపాయి. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు సీనియర్ టిడిపి నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాచమల్లు అధికారంలోకి వచ్చాక ప్రొద్దుటూరులో అవినీతి పరాకాష్టకు చేరి దోపిడీ విధానం మొదలై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ, గడచిన దశాబ్దాలుగా ప్రొద్దుటూరులో ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి అవినీతి అక్రమాలకు తావు ఇవ్వలేదని, టిడిపి నాయకులు ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిని ఎండకడతారంటూ, రానున్న ఎన్నికలు ఎమ్మెల్యే రాచమల్లుకు ప్రజల మధ్యనే జరుగుతాయని ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారంటూ అన్నారు. అనంతరం ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు జేబీవుల్లః మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులలో కూరగాయల మార్కెట్ తరలించటం, ధర్మల్ రోడ్డు లోని పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మించటం తప్ప చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని, అయితే ఇప్పటికీ అవి అసంపూర్తిగానే ఉన్నాయంటూ తెలిపారు. రోడ్ల నిర్మాణం మౌలిక వసతుల కల్పన నిరంతర ప్రక్రియ అని తమ టిడిపి ప్రభుత్వ హయాంలో కూడా నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరిగాయి అంటూ, రానున్న ఎన్నికలలో 40వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యే రాచమల్లు ఓడిపోనున్నారని, ప్రొద్దుటూరులో టిడిపి జెండా ఎగురవేసి, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు. సమావేశంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments