అమ్మ సలహా మేరకు పాదయాత్ర చేశా - ప్రవీణ్ రెడ్డి
కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఎనిమిది రోజుల తిరుమల పాదయాత్ర ముగించుకొని బుధవారం రాత్రి ప్రొద్దుటూరుకు చేరుకున్న టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, గురువారం ఉదయం ఆయన కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను జైలుకు వెళ్ళినప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కడప కేంద్ర కారాగారం నందు తనను తన కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారని, నేడు వారి కుటుంబం కష్టాల్లో ఉన్నందున తన తల్లి సూచనలు సలహాలు మేరకు తిరుమల పాదయాత్ర చేశానని తెలిపారు. దాదాపు 220 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో, అడుగడుగున టిడిపి నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు మద్దతు తెలుపుతూ తన వెంట నడిచారని, దైవదర్శనం అనంతరం ముడుపులు చెల్లించి రాష్ట్రాన్ని జగన్ సర్కార్ బారి నుండి కాపాడవలసిందిగా కోరానని, శుక్రవారం ఉదయం లోకేష్ బాబును కలిసి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్ల, 22వ వార్డు కౌన్సిలర్ గౌస్ మహమ్మద్, ప్రొద్దుటూరు మహిళా అధ్యక్షురాలు బి లక్ష్మీనారాయణమ్మ, సీనియర్ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి, చిట్టే మధుబాబు, తిప్పిరెడ్డిపల్లి దస్తగిరి, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments