ప్రొద్దుటూరు 1992 - 2022 :
కడప జిల్లా, ప్రొద్దుటూరు రాయాలసీమలోని ఒక ముఖ్య పట్టణం, వాణిజ్య పరంగా రెండవ ముంబై గా, దశరా వేడుకలకు రెండవ మైసూరుగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ప్రొద్దుటూరు కంటూ ఒక ప్రత్యేకమయిన గుర్తింపు ఉన్నది. అయితే అప్పట్లో అనగా 1992లో ఇక్కడి పలు ప్రాంతాలకు ఒక రౌడీ బ్యాచ్ గా ఏర్పడి గొడవలు గలాటాలు చేసేవారు, కాలక్రమేణా ఇటువంటి వారిపై పోలీసు వ్యవస్థ ఉక్కుపాదం మోపటంతో ఇక్కడి వ్యక్తులలో మార్పు వచ్చింది అని చెప్పవచ్చు, ఆనాటి ఆర్ధిక పరిస్థితులు సరిగా లేకపోవటం రౌడీల్లా చలామణి అయిన వారు తమ బాధ్యత తెలుసుకొని సంపాదన సంసారం పైపు అడుగులు వేసి మార్పును స్వాగతించారు. ఒక రకంగా చెబితే వీరెంతట వీరే వారి స్థితి గతులను మార్చుకున్నారు అని కూడా చెప్పవచ్చు. అయితే ఈనాడు 2022లో యువత చేతికి ఖరీదయిన వాహనాలు, తల్లిదండ్రులు సంపాదించి పెట్టగా విచ్చలవిడిగా జేబు నిండా డబ్బులు ఉండటంతో రకరకాల దురలవాట్లకు బానిసయిన యువత తమ విధులు మరచి చెడు మార్గం వైపు పయనిస్తున్నారు, ఆకారణముగా గొడవలకు కాలు దువ్వటం, రెచ్చిపోయి మంది మార్బలంతో వీధుల్లో వీరంగం సృష్టించటం పరిపాటిగా మారిపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తీసుకురావాలి అని శ్రమిస్తున్నా, అది వీరికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావటం జరుగుతోంది. ఎలాగంటే అబ్బా అన్న ఇప్పటికి మూడు మార్లు స్టేషన్ గుమ్మం తొక్కి వచ్చారు ఏదయినా గొడవ ఉంటే పలానా అన్న దగ్గరికి వెళ్ళండి అనేంతగా మారారు యువత. అప్పట్లో స్టేషన్ గుమ్మం ఎక్కితే అవమానం అనుకునే వారు మార్పు వైపు అడుగులు వేశారు, నేడు అది కాస్త సీన్ రివర్స్ అయ్యింది. నేటి యువత సిగరెట్, జర్దా పాన్, గంజాయి, గుట్కా, మద్యపానం లాంటి వ్యసనాలకు అమితంగా ఆకర్షితులయి క్షణికావేశాలకు లోనవుతున్నారు. ఏది ఏమయినా తల్లిదండ్రులు తమ పిల్లలను కనుసన్నల్లో పెట్టుకొని సరయిన సమయ పాలన చేస్తూ వారి ప్రవర్తనను గమనిస్తూ అటు విద్య ఇటు ఉద్యోగ వ్యాపారాల వైపు అడుగులు వేయించటంలో విఫలమయ్యారనే చెప్పాలి. తల్లిదండ్రులు తమ పరిస్థితులు బిడ్డలకు తెలపాలి, జీవితంలో వారు పడ్డ బాధలు చీదరింపులు చీత్కారాలు ఆర్ధిక ఇబ్బందులను పిల్లలకు తెలియచేయాలి అప్పుడే వారిలో కొంత ఆలోచనా శక్తీ పెరిగి ఏది మంచి ఏది చెడు అని స్వతహాగా ఆలోచిస్తారు అని భావిస్తున్నాను.
Comentários