వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి - టిడిపి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
వెంటనే ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, గతంలో ఎన్నడు లేని విధంగా నేడు కరువు ఏర్పడిందని రాజుపాలెం మండలం మాజీ జడ్పిటిసి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం నెహ్రు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాలను వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలని, వైసిపి చెపుతున్నట్లు కరువు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఎమ్మెల్యే రాచమల్లు హామీ ఇవ్వాలని, టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన నీరు-చెట్టు పనుల బిల్లును ఇప్పటికి వైసిపి ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. ప్రధాన కాలువలలో పూడికలు తీశారు తప్ప ఉప కాలువలలో పూడికలు తీయలేదని దీనివల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో 15 చెక్ డ్యాములు నిర్మించగా వందల ఎకరాల భూమి సాగు చేసుకుంటున్నట్లు, ఈక్రాప్ చేయాలంటే యాప్ సరిగా పని చేయటం లేదని, దీని వలన పంట ఇన్సూరెన్స్ కోల్పోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఒక రూపాయి ఇన్సూరెన్స్ వలన లాభం కంటే నష్టం ఎక్కువ ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు రాజుపాలెం మండలాల రైతులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments