top of page
Writer's picturePRASANNA ANDHRA

బలిజ సంఘీయులు టిడిపి వైపు - బలిజ సంఘ నాయకులు

బలిజ సంఘీయులు టిడిపి వైపు - బలిజ సంఘ నాయకులు

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సన్మానిస్తున్న బలిజ సంఘం నాయకులు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు బలిజ సంఘం ఆధ్వర్యంలో పెన్నా నది ఒడ్డున గల బలిజ కళ్యాణ మండపం నందు ప్రొద్దుటూరు టిడిపి మాజీ పట్టణ అధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ బుక్కపట్నం జయశంకర్, బలిజ సంఘ నాయకుల ఆధ్వర్యంలో బలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రతి ఒక్క బలిజ కులస్తులు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని, రానున్న టిడిపి ప్రభుత్వంలో బలిజలకు పెద్దపీట వేయాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులస్తులను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా జనసేన నాయకులు మంచి శివ మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధికంగా బలిజ కులస్తులు ఉన్న గ్రామం తాళ్లమాపురం అని, అలాంటి ఈ గ్రామంలో 2019 నుండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని తమ ఆవేదన ఫ్లెక్సీలు రూపంలో ఇక్కడి స్థానిక నాయకులకు ప్రభుత్వానికి తెలియజేసిన సరైన స్పందన లేదని, నాడు వరద హయాంలో వేసిన రోడ్లు తప్ప వాటికి మరమ్మత్తులు చేసిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ ఎన్నికలలో తాళ్లమాపురం గ్రామ ప్రజలు వరదకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

అనంతరం టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని, జగన్ దుర్మార్గపు పాలన, మరోమారు వైసిపి అధికారంలోకి రాకూడదు అనే దృఢనిశ్చయంతో పవన్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నారని అన్నారు. కాపు కార్పొరేషన్ రద్దు చేసిన ఘనత వైసిపి సర్కార్ కే దక్కుతుందని, రానున్న టిడిపి ప్రభుత్వంలో బలిజ కులస్తులకు పెద్దపీట వేసి కార్పొరేషన్ పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారు. కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న కాపు, బలిజ కులస్తులను ఆర్థికంగా అణగదొక్కిన వైసీపీ ప్రభుత్వానికి కులస్తులు సరైన పాఠం చెప్పాలని, రానున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా వరదను గెలిపించాల్సిన బాధ్యత బలిజలపై ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో బలిజ సంఘ ముఖ్యులు సొద్దల మధు, రిటైర్డ్ ఎస్ఐ శంకర్, మందాల మునయ్య, మాజీ కౌన్సిలర్ ఘంటసాల సావిత్రమ్మ, కోటా శ్రీదేవి, తదితరులు పాల్గొనగా టిడిపి నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, విఎస్ ముక్తియార్, అత్యధికంగా బలిజలు ఈ సమావేశానికి హాజరై తమ పూర్తి సహాయ సహకారాలు ఈ ఎన్నికలలో టిడిపికి అందిస్తామని వాగ్దానం చేశారు.



337 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page