top of page
Writer's pictureEDITOR

ఓ బార్ యజమాని ఓ సారి ఆలోచించు?

పగలనక రేయనక పనిపాటలందూ - మునిగి తేలేటి నా మోహాలబరిణె -

కంచెలు కంపలూ నడిచేటి వేళా - కంప చాటునుండి కొంప తీయకోయీ -

నాగుల్లచవితికి నాగేంద్ర నీకూ - పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ -


నీ పుట్ట దరికి నా పాపలోచ్చేరు - పాప పుణ్యముల వాసనే లేని -

బ్రహ్మస్వరూపులో పసికూనలోయీ - కోపించి బుస్సలు కొట్టబోకోయీ -

నాగుల్లచవితికి నాగేంద్రనీకూ - పొట్టనిండా పాలు పోసేము తండ్రీ...


ఈ పాట ఎవరు రాసారో ఎవరు పాడేరో కూడా తెలీదు... ఇది ఓ భార్య, ఓ తల్లి నాగులచవితికి పుట్టలో పాలుపోస్తూ తన భర్త, పిల్లలను చల్లగా చూడమని ఆ నాగేంద్రుని వేడుకుంటూ ఆలపించినదేమో... నేడు పుట్టల్లా పుట్టుకొచ్చిన బార్ అండ్ రెస్టారెంట్లకు ఆ తల్లి ఏ పాట పాడితే సరిపోతుందో పాఠకుల విజ్ఞతకే వదిలేస్తున్నాను...

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా? ఈ పాటలు, పద్యాలు మాకెందుకు సూటిగా విషయం వార్త రూపంలో తెలియపరచవచ్చుకదా! అని ఇప్పటికే మీకు ఆ ఆలోచన వచ్చి ఉంటుంది... ఇక విషయానికి వస్తాను, తెల్లవారుజామునుండే ప్రొద్దుటరులోని పలు బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు విరుద్ధంగా తలుపులు తెరచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నాయి. తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు నిరాటంకంగా నిర్విఘ్నంగా ఈ తంతు సాగుతోంది, ముఖ్యంగా ఇక్కడికి ఉదయాన్నే కూలి పనికి వెళ్లే వారినే టార్గెట్ చేసుకుని మరీ మద్యం విక్రయాలు చేస్తూ, బహిరంగంగానే అమ్మకాలు సాగిస్తూ, బార్ లోపలే కూర్చుండబెట్టి మరీ మద్యం తాపిస్తున్నారు, ఇదేంటి అని ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు.

దినసరి కూలీలు, వేతన జీవులే వీరి ఆదాయానికి ప్రధాన వనరులుగా మారారు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదనే చెప్పాలి. తన భర్త తెల్లవారుజామునే లేచి కూలి పనికి బయలుదేరే సమయంలో ఆ భార్య తనకు, తన పిల్లలకు తినటానికి తిండి మంచి బట్ట తెస్తాడని ఆశించి ఎదురు వచ్చి సాగనంపితే, ఇతగాడు పట్టణంలో ఏ బార్ ముందుగా తెరిచారో విచారించి అక్కడికి చేరి పూటుగా మద్యం సేవించి పనిలోకి దిగుతాడు. అంతా బాగానే ఉంది సాయంత్రం గడిచిపోయింది, ఇక ప్రభుత్వం మద్యం దుకాణాల వంతు, దగ్గరలోని మద్యం దుకాణానికి వెళ్లి ఇక షరా మామూలే, ఇంటికి తిరిగి వచ్చిన భర్త మద్యం మత్తులో జోగాడుతుండగా... భార్యా, పిల్లలు పస్తులతో కాలం వెళ్లదీస్తుంటారు...

ఇప్పుడు నేను పైన చెప్పిన పద్యమో, లేక పాటనో ఒకసారి చదవండి, ఇక్కడ పాములు ఎవరో, పుట్ట ఎక్కడ ఉందొ మీకే అర్థం అవుతుంది. అమ్మే వాడిది తప్పు కాదు అంటారా, లేక తాగే వాడిది తప్పు కాదు అంటారా, ఏది ఏమైనా మందుబాబులు ఒక్క విషయం గుర్తెరగాలి, ఇంటి దగ్గ్గర మీ భార్య పిల్లలను పస్తులు పెట్టి బార్ యజమానుల, ప్రభుత్వ మద్యం దుకాణాల కడుపు నింపాలనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తూ... ఇలాంటి వారిని టార్గెట్ చేసి సంపాదించిన సొమ్ము ఏ మేరకు ఏ మేలుకు వస్తుందో షావుకార్లు ఒకమారు ఆలోచించాలి. ఇకనైనా నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామునుండే బార్లు తెరచి విక్రయాలు జరపకూడదని సవినయంగా తెలియచేసుకుంటూ, సంబంధిత శాఖ తగు నిర్ణయం తీసుకొని ఇలాంటి బార్ల అనుమతిని రద్దు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.


240 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page