నియోజకవర్గ వ్యాప్తంగా 139 మంది ట్రబుల్ మాంగ్లర్స్ గుర్తింపు
64 సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ
ఎన్నికలలో ఓడిన వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మే నెల 13వ తేదీన ఎన్నికలు ముగిశాక ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో తొమ్మిది మందిపై రౌడీషీట్ తెరిచామని, మొత్తం 139 మందిని ట్రబుల్ మాంగులర్స్ గా గుర్తించినట్లు డిఎస్పి మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించినట్లు తథానుగుణంగా కొన్ని సూచనలు చేశారు. ఇందులో భాగంగా, ప్రొద్దుటూరు పరిధిలో మొత్తం 64 సీసీ కెమెరాల ద్వారా వివరాలు సేకరిస్తున్నామని, ఎన్నికల కమిషన్ విధి విధానాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా వారిపై కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని, జిల్లా కలెక్టర్, రెవెన్యూ మేజిస్ట్రేట్ ల ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
జూన్ 1వ తేదీ నుండి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఇతర జిల్లాల నుండి కూడా అదనపు బలగాలను రప్పించినట్లు, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడిన ఉపేక్షించేది లేదని, అల్లరి మూకలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలలో గెలుపోటములు సర్వసాధారణమని ఓడిన వారిని గెలిచిన వారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఇప్పటికే బైండోవర్ ఉన్నవారిలో మరలా కొత్త కేసులు నమోదైతే వారి ఆస్తులు జప్తుకు చర్యలు తీసుకుంటామని, ఏ పార్టీ వారైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేస్తే కఠిన చర్యలు తప్పవని, ఓట్ల లెక్కింపు తర్వాత బాణాసంచా నిషేధించినట్లు, ఎవరైనా బాణాసంచా పేల్చితే కేసును నమోదు చేస్తామని గట్టిగా హెచ్చరించారు. సమావేశంలో పట్టణ, రూరల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comentarios