Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు / ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సంప్రదించండి - 9912324365
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రపంచ వ్యాప్తంగా నేడు రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్న వేళ, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అపశృతి చోటుచేసుకుంది. పట్టణంలో రక్తదాతలకు కొదవలేదు, కొన్ని బ్లడ్ గ్రూపులు మినహా ఓ+ve, బి+ve రక్త దాతలకు అస్సలు కొదవలేదు. అయితే దాతలు ఇచ్చిన రక్తాన్ని గ్రూపుల వారీగా విభజన చేయటంలోనో లేక విభజన చేసి రక్తాన్ని నిల్వ ఉంచి భాదితులకు అందించటంలోనో ప్రభుత్వ రక్తనిధి కేంద్ర సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలపాలి. వివరాల్లోకి వెళితే... ఏ. ప్రసన్న అనే గర్భవతి రక్తహీనత కారణంగా వైద్యుల సలహా మేరకు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో B+ve రక్తం ఎక్కించాలని సూచించారు, అయితే ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రం సిబ్బంది, సంబంధిత స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం కారణంగా B-ve రక్తాన్ని పదిహేను నిమిషాల పాటు ఎక్కించటం జరిగింది. కాగా ప్రసన్న భర్త శరత్ కుమార్ స్థానికంగా ప్రైవేట్ టెక్నిషియన్ గా పని చేస్తున్నాడు, విషయ పరిజ్ఞానం గల శరత్ కుమార్ బి+ve బదులు బి-ve రక్తాన్ని తన భార్య ప్రసన్నకు ఎక్కిస్తున్నారని గమనించి వెంటనే సిబ్బందికి తెలుపగా, వారు ఇది బి-ve కాదు బి+ve అని బుకాయించారని, రికార్డుల్లో సైతం బి-ve గా నమోదయినదని బాధితురాలి భర్త తెలియచేసారు. తాను విషయం గమనించకుంటే ఎంతటి అనర్ధం జరిగేదో అని ఆవేదన చెందారు. తాను గమనించిన కారణంగానే తన భార్యకు ప్రమాదం తప్పిందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షమేనని, సాధారణ వ్యక్తులకు బ్లడ్ గ్రూపుల గురించి తెలియని వారికి ఇలా జరిగే ప్రాణాలకే ముప్పని ప్రజలు ఇది గమనించాలని హితువు పలికారు.
సంబంధిత ఆసుపత్ర్రి సూపరింటెండెంట్ దగ్గరికి శరత్ కుమార్ వెళ్లగా, ఇది తమ సిబ్బంది నిర్లక్షమేనని, బి+ve రక్తం బదులుగా బి-ve రక్తం ఎక్కించారని తెలిపారన్నారు. అయితే సంబంధిత రక్తనిధి కేంద్ర సిబ్బంది నేడు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందున అక్కడికి వెళ్లారని తెలిపారన్నారు. రక్తదాన సేవా కేంద్రాల నిర్వాహకులు, పలువురు రక్తదాతలు పై విషయం తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. తాము స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తుంటే ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యం వహించటం తగదని సంబంధిత సిబ్బంది నిర్లక్షానికి ఎటువంటి శాఖాపరమయిన చర్యలు సూపరింటెండెంట్ తీసుకుంటారో వేచి చూడాలన్నారు. కాగా విషయం తెలిసిన మీడియా సిబ్బంది బాధితురాలిని సంప్రదించాలని ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు వార్డులోని నర్సులు చెప్పటం ఇక్కడ గమనార్హం.
Comentários