అనుభవలోపం గర్భవతికి మృత్యుపాశం
వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా కాన్పులు చేస్తారు అంటే మీరు నమ్ముతారా, అందునా ఒక్క రూపాయి కూడా నగదు చెల్లింపులు, రసీదులు లేకుండా ఆపరేషన్ చేసే సమయంలో ఏకంగా తొమ్మిది బాటిళ్ల రక్తం ఎక్కించి మరీ ఆపరేషన్ చేశారు కొందరు డాక్టర్లు. ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా ఎక్కడో కాదండి మన ప్రొద్దుటూరులోనే, ఉచిత కాన్పులు ఆపరేషన్ లకు ఇప్పుడు మీరు సుదూరతీరాలు వెళ్లనవసరం లేదు ప్రప్రధమంగా మన ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ కు ఇప్పుడే విచ్చేయండి, అయితే మీ ప్రాణాలకు డాక్టర్లు జవాబుదారీ కాదు. అదేంటి ఉచితంగా ఆపరేషన్లు అంటున్నారు, మీ ప్రాణాలకు డాక్టర్లు జవాబుదారీ కాదు అంటున్నారు అని అనుకుంటున్నారా...
వివరాల్లోకి వెళితే పట్టణంలోని గాంధీరోడ్డులో ఉన్న ఓ నర్సింగ్ హోమ్ నందు గురువారం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న, కొండాపురం గ్రామానికి చెందిన సువర్ణ కుమారి(33) తన రెండవ కాన్పు కొరకు ఆసుపత్రిలో చేరగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి, కాసేపటికే డాక్టర్ల నిర్లక్షానికి తీవ్ర రక్తస్రావం అవటం గమనించిన డాక్టర్లు రక్తస్రావం ఆగటానికి తమవొంతు ప్రయత్నం చేశారట, అయినా ఫలితం లేకపోవటం చేత కాసేపు ఠాగూర్ సినిమాను భర్త, సమీప బంధువులకు చూపించి అక్షరాలా ఎనబై వేల రూపాయల ఫీజులు వసూలు చేసి, నింపాదిగా చావు కబురు చల్లగా చెప్పినట్లు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సువర్ణ కుమారికి అధిక రక్తస్రావం అవుతోంది తక్షణమే మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు కు తీసుకుని వెళ్ళాలి అని చేతులు దులుపుకున్నారు, కాగా అంబులెన్సులో సువర్ణ కుమారిని తరలించిన బంధువులు పులివెందుల మార్గమధ్యలోనే మరణించింది. విషయం తెలుసుకున్న సమీప బంధువులు శుక్రవారం ఉదయం ఆసుపత్రి వద్దకు చేరుకొని ధర్నాకు దిగారు, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేయటం వాదోపవాదాలకు త్రావుతీసింది, విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్వయానా ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చే ప్రయత్నం చేసి, బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఆసుపత్రి వర్గాలను కోరారు. ఇక వేచి చూడాలి ఏమి జరగనుందో? తమకు జరిగిన అన్యాయంపై ఇదేమిటని ప్రశ్నించిన బాధిత మహిళ కుటుంబ సభ్యులకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు ఆసుపత్రి వర్గాలు, తాము ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదని, పైపెచ్చు తొమ్మిది ప్యాకెట్ల రక్తాన్ని ఎక్కించామని, సువర్ణ కుమారికి అధిక రక్తస్రావం కావటం చేతనే మరణించి ఉండవచ్చునని తేటతెల్లం చేస్తూ కుండ బ్రద్దలుకొట్టారు.
ఇది ఇలా ఉండగా సువర్ణ కుమారి బంధువులు తమకు తగు న్యాయం చేయమని పలువురిని ప్రాధేయపడటం అక్కడి వారిని కలచివేసింది. మృతురాలి పిల్లలు ఒకరికి రెండు సంవత్సరాలు మరొకరు పురిటి బిడ్డ కావటం చూసిన వారి కళ్ళు చెమర్చాయి. తనకు తన పిల్లలకు తగు న్యాయం చేసి వారిని ఆదుకోవాలని చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న సువర్ణ భర్త అక్కడి వారిని ప్రాధేయపడ్డారు. బంధువుల ఆర్తనాదాలు కన్నీళ్ల నడుమ ఆసుపత్రి ప్రాంగణంలో ఒకింత శోకసముద్ర వాతావరణం నెలకొంది.
Comments