ఇకపై కఠిన చర్యలు తప్పవు - పోలీసు శాఖ
వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐ.పి.ఎస్ ఆధ్వర్యంలో ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ నందు పాత్రికేయుల, యూట్యూబర్ల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఒకటవ, రెండవ, ట్రాఫిక్ పట్టణ పోలీసు స్టేషన్ సీఐలు, మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐ కృష్ణం రాజు నాయక్ పాల్గొనగా, సమావేశాన్ని ఉద్దేశించి సిఐ లు మాట్లాడుతూ పాత్రికేయులు పోలీసులు సమాజహితం కొరకు అంకితభావంతో పనిచేసి, స్నేహభావంతో మెలగాలని, ముఖ్యంగా కొంత మంది యూట్యూబర్లు వార్తలను ప్రసారం చేయటంలో కొంతమేర అశ్రద్ధ వహిస్తున్నారని, శ్రద్ద వహించి వార్తల్లోని అనుచిత వ్యాఖ్యలను, ఆరోపణలను, సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకొని, వాటిని తొలగించి ప్రచురణ చేయవలసిందిగా వారు కోరారు. అలా కాని యెడల ప్రచురణ చేసిన వార్త వలన అనుకోని సంఘటనలు జరిగి పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిన ఎడల, ముందుగా సంబంధిత వాట్సాప్ గ్రూపు అడ్మిన్ పైన, వార్త ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ పై శాఖాపరమైన చర్యలు తప్పవని ముందస్తుగా హెచ్చరించారు. ఇందుకుగాను వాట్సాప్ గ్రూపు అడ్మిన్ తప్పుడు ఆరోపణలు, సంభాషణలు, వార్తలను పంపిన వ్యక్తిని గ్రూపు నుండి రిమోవ్ చేయటమో లేక, వాట్సాప్ నందు పొందుపరచిన 'డిలీట్ ఫర్ అల్' ఆప్షన్ ద్వారా సమాచారాన్ని తొలగించాలని ఉదహరించారు.
కొందరిని తాము ఇప్పటికే గుర్తించామని, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు, వ్యాఖ్యలు ప్రసారం చేయటం వలన సమాజంలో, ముఖ్యంగా రాజకీయ పార్టీలలో అంతర్గత కలహాలు కుమ్ములాటలు జరిగి లా అండ్ ఆర్డర్ దెబ్బతినటమే కాకుండా ప్రజలకు అసౌకర్యంగా మారుతుందని, కావున సమాజహితం కోరి పలువురికి ఉపయోగపడే వార్తలనే ప్రసారం చేయాలని, ఉన్నత శాఖ అధికారుల ఆదేశానుసారం తాము బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని ఒకరినొకరు గౌరవించుకొని వార్తల రూపంలో తప్పుడు సమాచారం, సంకేతాలు గ్రూపుల యందు పోస్ట్ చేయవద్దని వారు కోరారు. ఇదిలా ఉండగా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్న రాజకీయ నాయకులపై ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తాము అని పోలీసు శాఖ వెల్లడించకపోవడం ఇక్కడ గమనార్హం.
Comments