ప్రొద్దుటూరు ప్రజా మేనిఫెస్టో విడుదల చేసిన వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ సోమవారం నాడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో, ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు ప్రజా మేనిఫెస్టోను మంగళవారం మధ్యాహ్నం నెహ్రు రోడ్డులోని ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. ఎన్నికల అనంతరం తాను గెలుపొందిన నేపథ్యంలో ప్రొద్దుటూరులో చేయనున్న కార్యక్రమాలను మేనిఫెస్టో రూపంలో విడుదల చేస్తూ, ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకై తాను రాజోలి ఆనకట్ట నిర్మాణం, స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయటం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా ప్రొద్దుటూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఇరిగేషన్ కెనాల్స్ ఆధునీకరణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడతామని అన్నారు.
టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ప్రొద్దుటూరు యువతకు ప్రాధాన్యత, కూరగాయల మార్కెట్ నిర్మాణంలో వైసిపి నాయకులు చేసిన అవకతవకలను ఎత్తి చూపిస్తూ గతంలో శివాలయం ఎదురుగా గల కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులకు తొలి ప్రాధాన్యతనిస్తూ వారి అంగళ్లు వారికి కేటాయిస్తామని, మైదుకూరు రోడ్డులోని జిన్నా రోడ్డు ద్వారా బైపాస్ ను కలిపే ప్రయత్నం, డీఎస్పీ ఆఫీస్ వద్ద నుండి ఎర్రగుంట్ల రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు, గాంధీ రోడ్డు వినాయక నగర్ నుండి ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వరకు రోడ్డు నిర్మాణం చేపడతామని, రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ప్రొద్దుటూరులో వ్యాపారులు వర్తకులు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పుతామని హామీ, టిడిపి పాలనలో రెండు సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు అందిస్తామని అన్నారు..
రైతాంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు పనిముట్లు డ్రిప్ ఇరిగేషన్ విత్తనాలు పురుగుల మందులు ఇప్పిస్తామని, ఉపాధి హామీ పనులను అగ్రికల్చర్ అనుసంధానం చేయనున్నట్లు, మహిళా సాధికారత దిశగా అడుగులు వేసి డ్వాక్రా సంఘాలను మరింత బలోపేతం చేసి స్వయం ఉపాధికి వూతం కల్పిస్తామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, కులాల వారీగా కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం, చేనేతలకు సహకార సంఘాలు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల వసతులు కల్పించటం పెన్షన్లు అందజేయటం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్న ప్రొద్దుటూరులో శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజలకు ఇబ్బంది లేకుండా హామీ ఇస్తూ, వారికి ఏ ఇబ్బంది వచ్చినా తన వద్దకు ఏ సమయానైనా రావచ్చునని వారికి రక్షణ కల్పించే బాధ్యత హామీ తాను ఇస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈవీ సుధాకర్ రెడ్డి, రాజుపాలెం మాజీ జెడ్పిటిసి తోట మహేశ్వర్ రెడ్డి, యువ నాయకులు అమల్ రెడ్డి, టిడిపి నాయకులు జంపాపురం రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments