సిద్ధం దీనికేనా! ప్రశ్నించిన పాత్రికేయులు?
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభ నందు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ జిల్లా ఫోటో జర్నలిస్ట్ కృష్ణ పై వైసిపి మూకల మూకుమ్మడి దాడిని ఖండిస్తూ సోమవారం ఉదయం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా మద్దతునిస్తూ టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కృష్ణ పై జరిగిన భౌతిక దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నిరసన కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ, అటు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే జర్నలిస్టులపై దాడి హేయమైన చర్యగా భావిస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం పాత్రికేయ మిత్రులు మాట్లాడుతూ, పార్టీలకతీతంగా తాము వ్యవహరించి ప్రజా సమస్యలను ప్రభుత్వ వైఫల్యాలను పత్రికాముఖంగా తెలియచేయడమే తప్పా అని ప్రశ్నించారు? కృష్ణ పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని, ఇకనైనా ప్రభుత్వం అలాగే పోలీసు శాఖ దాడి జరిగిన తీరును గమనించి దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఏకమై ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ప్రొద్దుటూరు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఆపై దాడిని ఖండిస్తూ సిద్ధం దీనికేనా అంటూ బ్యానర్లు చేతపట్టి ఎమ్మార్వో కార్యాలయం నుండి రాజీవ్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నాయకులు, సభ్యులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Comments