బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీకి లేదు - టీడీపీ
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో గురువారం ఉదయం కడప జిల్లా అధికార ప్రతినిధి నెట్టుపల్లి శివరాం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ కులాల ఓట్లు దండుకొని గత మూడున్నర సంవత్సరాల కాలంలో బీసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బీసీల ఓట్లను అడిగే నైతిక అర్హత జగన్కు లేదని అన్నారు. వైసిపి ప్రభుత్వం బీసీలను రాజకీయంగా గౌరవిస్తున్నామని అంటున్నారే తప్ప, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ 34 శాతం రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చారని, బడుగు బలహీనవర్గాలకు ప్రోత్సాహకాలు అందించింది టిడిపి ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. కాగా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను నేడు 25 శాతానికి కుదించారని, గత టిడిపి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసి 2019 ఎన్నికలలో కూడా 34 శాతం అసెంబ్లీ టికెట్లలో రిజర్వేషన్ టిడిపి పార్టీ కల్పించిందని ఆయన గుర్తుచేస్తూ, వైసిపి ప్రభుత్వం రాజకీయంగా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని, టిడిపి నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశ్నించిన వారిని హతమారుస్తున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 27 మంది బీసీలను హత్య చేయగా, 600 మంది బీసీ సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందన్నారు. ఇప్పటికైనా బీసీ సోదరులందరూ సంఘటితంగా ముందుకు వెళ్లి రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు వైసీపీ ప్రభుత్వానికి బీసీలు గుర్తొస్తున్నారని ఆయన యదేవా చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య ద్వారా పలువురు విద్యార్థులు లబ్ధి పొందగా, నేడు విదేశీ విద్యను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందని అన్నారు. కాగా 2019 ఎన్నికలలో కడప జిల్లా నుండి ఏ ఒక్క బీసీకి కూడా అసెంబ్లీ టికెట్ వైసిపి పార్టీ కేటాయించలేదని, కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కూడా బీసీలకు అమ్ముకున్నారని ఆరోపించారు.
కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి నెట్టుపల్లె శివరాం, రాష్ట్ర లీగల్సేల్ ప్రధాన కార్యదర్శి గురప్ప యాదవ్, జిల్లా మైనారిటీ అధికార ప్రతినిధి అల్తాఫ్ హుస్సేన్, టిడిపి పార్లమెంట్ కార్యదర్శి సిద్దయ్య, టీడీపీ నాయకులు మనోహర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
Comments