టూరిస్ట్ బస్సు లారీ ఢీ
ఇరువురు డ్రైవర్లు మృతి - 40 మందికి గాయాలు - పది మంది పరిస్థితి విషమం
మెరుగైన చికిత్సల కొరకు కడప , తిరుపతి లకు తరలింపు
ప్రొద్దుటూరు నుండి రామేశ్వరం బయలుదేరిన ట్రావెల్స్ బస్సు
క్షతగాత్రులు ప్రొద్దుటూరు జమ్మలమడుగు వాసులు
సంబేపల్లి
కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిలోని దేవపట్ల గ్రామం వడ్డేపల్లి వద్ద ట్రావెల్స్ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ వెంకటనారాయణ (37) ఇరువురు డ్రైవర్లు సంఘటనా స్థలంలోని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాల మేరకు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన 40 మంది ట్రావెల్స్ బస్సులో గురువారం రామేశ్వరం వెళ్తుండగా తమిళనాడు వైపు నుంచి రాయచోటి వైపు వెళ్తున్న లారీ దేవపట్ల గ్రామం వడ్డేపల్లి సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఢీకొనడంతో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాళ్లు చేతులు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. లారీ క్యాబిన్లో మృతి చెంది ఇరుక్కుపోయిన డ్రైవర్ ను జెసిబి సహాయంతో పోలీసులు బయటకు తీశారు. గాయపడి క్షతగాత్రులను మూడు 108 అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల రోదనలు వర్ణనాతీతం. తీవ్రంగా గాయపడిన వారిని తిరుపతి కడప లకు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments