ముఖ్యమంత్రి పదవి లక్ష్యం కాదు - పవన్ కళ్యాణ్
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేయడం లేదని పరోక్షంగా సూచించారు.40 సీట్లుంటే సీఎం పదవి అడిగేవాడినన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా జనసేన పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు.
ఇటీవల కొద్దికాలంగా సినిమాలపై ఫోకస్ చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి పర్యటన చేపట్టారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశం ద్వారా పొత్తులపై తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం పదవి డిమాండ్ లేదని పరోక్షంగా సూచించారు. బలం చూపించి పదవి తీసుకోవాలని, షరతులు పెట్టితే కుదరదని చెప్పారు. వైసీపీ నుంచి అధికారం లాక్కుని ప్రజలకు అప్పగించడమే పార్టీ లక్ష్యమన్నారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితేనే పొత్తు పెట్టుకోవాలని చెబుతున్న వ్యాఖ్యలపై సైతం స్పందించారు. రాష్ట్ర ప్రజలు 40 స్థానాలు ఇచ్చుంటే సీఎం పదవి డిమాండ్ చేసేవాడినని చెబుతూ పరోక్షంగా ఆ డిమాండ్ ఇప్పుడు చేయడం లేదనే సంకేతాలిచ్చేశారు.
2014లో కూడా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. గౌరవానికి భంగం కలగకుండా పొత్తులుంటాయన్నారు. గతంతో పోలిస్తే జనసేన బలం గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకు సగటున 7 శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ బలం 18-19 శాతానికి పెరిగిందన్నారు. 2019 నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పొత్తుల గురించి మాట్లాడానన్నారు. 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశామని..అప్పట్లో కనీసం 30-40 స్థానాలు గెల్చుకునుంటే కర్ణాటక తరహా పరిస్థితి ఉండేదన్నారు.
పొత్తులకు కొన్ని పార్టీలు ఒప్పుకోకుంటే ఒప్పిస్తామన్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో పొత్తులుంటాయని తెలిపారు. సీఎం పదవి డిమాండ్ చేయాలంటే 30-40 సీట్లు ఉండాలన్నారు. కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతోనే ముఖ్యమంత్రి అయిన సంగతిని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
Comentarios