కుక్కలకు ఉచిత ర్యాబిస్ టీకాలు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా రాజంపేట ప్రాంతీయ పశువైద్యశాల యందు ఉప సంచాలకులు డాక్టర్ అబ్దుల్ ఆరిఫ్ ఆధ్వర్యంలో శనివారం పెంపుడు కుక్కలకు ఉచిత ర్యాబిస్ టీకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఆరిఫ్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా మూడు పెంపుడు కుక్కలకు కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్స నిర్వహించి, 22 కుక్కలకు రాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి శనివారాన్ని ప్రపంచ పశువైద్య దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. పశు వైద్యాధికారులు అంకితభావంతో పనిచేసి నోరులేని మూగజీవాలకు వ్యాధి బారిన పడకుండా వ్యాధి నిరోధక టీకాల ద్వారా రక్షించి పశుసంతతి వృద్ధికి తోడ్పడుతూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన శస్త్ర చికిత్స విభాగంలో పెంపుడు కుక్కలు, వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, జంతు యజమానులు స్వచ్ఛంద సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కుక్కల ద్వారా మనుషులకు సంక్రమించే భయంకరమైన ర్యాబిస్ వ్యాధిని నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కె.ప్రతాప్, జూనియర్ వెటర్నరీ అధికారి ఎం.వరదయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Comments