గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మండలం కామనూరు గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామనూరు గ్రామంలో దాదాపు తొంబై శాతం ఇళ్లకు తమ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పధకాలు అందాయని, పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందరికీ దక్కాలన్నదే తమ ప్రభుత్వ ద్యేయం అని, గ్రామంలో పంతొమ్మిది వందల ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉండగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇక్కడి రైతులకు వ్యవసాయ సలహాలు, ఎరువుల పంపిణీ చేస్తూ, ప్రతి సంవత్సరం పదమూడు వేల అయిదు వందల రూపాయలు వ్యవసాయానికి ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని ఆయన వెల్లడించారు.
కామనూరు గ్రామంలోని ప్రజలు తనను ఆదరిస్తున్నారని 2005వ సంవత్సరంలో నాటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి అనుచరుడిగా ఇక్కడికి వచ్చానని, తిరిగి 2022వ సంవత్సరంలో ఎమ్మెల్యే హోదాలో ఇక్కడికి రావటం సంతోషంగా ఉందని, పాతిక సంవత్సరాలు వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా పాలన సాగించారని ఆ కాలంలో ఇక్కడి గ్రామ ప్రజలు ఏనాడు ఓటు హక్కు వినియోగించుకోలేదని, ప్రజాస్వామ్యంలో ఓటు అందరి హక్కు అని ఆయన గుర్తు చేశారు. తాను 1996లో రాజకీయాలలోకి వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అడుగుజాడల్లో నడచి రాజకీయాలను అవపోసనపట్టి, ఆయన దగ్గర కొన్ని సద్గుణాలను సులక్షణాలను నేర్చుకున్నానని, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తన రాజకీయ గురువు అని గుర్తు చేశారు.
Comments