ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు తెచ్చే పనులు నేను చేయను - రాచమల్లు
వైయస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చే పనులు తాను గతంలోనూ, ఎన్నటికీ చేయనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ఈ పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తున్నానని, ప్రజలు తనను రెండుసార్లు ఎమ్మెల్యే గా నమ్మకం తో గెలిపించారని, ప్రజలకు ఎలా సేవ చేయాలో తనకు తెలుసునని, నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చే పనులు తాను ఏనాడు చేయలేదని, ప్రజల విశ్వాసాన్ని వొమ్ము చేయనని ఆయన అన్నారు. ప్రజా జీవితంలో ఉంటున్న తాను వ్యసనాలను త్యజించి అనునిత్యం ప్రజా సేవకే అంకితం అయ్యానని, అలాంటి తాను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతానా అంటూ ప్రశ్నించారు?
గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు వైసీపీ నాయకుల పైన వ్యక్తిగత, బలహీనమైన విమర్శలు టీడీపీ నాయకులు చేస్తున్నారని, రాష్ట్రంలో నూతన నాయకత్వం వచ్చినప్పటినుండి విమర్శలు, అసత్య ప్రచారాలు, ఆరోపణలు ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రత్యర్థిని గెలిచే మార్గం కుట్రలు కుతంత్రాలు కాదని, ప్రజా సేవ ప్రదర్శించి విజయం సాధిస్తే సమాజం హర్షిస్తుందని హితువు పలికారు. ప్రజా సమస్యలపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించాపోగా, వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, నారా లోకేష్ పాదయాత్ర ఆద్యంతం అటు వైసీపీ ప్రభుత్వాన్ని ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయటానికి సరిపోతోందని, ప్రజా సమస్యలు టీడీపీ కి పట్టటం లేదని విమర్శించారు.
అటు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు, నియోజవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్య్రమాలు తమ ప్రభుత్వం చేపడుతున్నా, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ, ఒక్క వ్యభిచారం తప్ప అన్ని అసాంఘిక కార్యకలాపాలకు తానే బాధ్యుడిని అని అంటున్నారని, తనను బెట్టింగ్ రెడ్డి అని లోకేష్ సంబోధించడం హాస్యాస్పదం అని, నియోజకవర్గ ప్రజల ప్రతిష్ట కోసం సీబీఐ ఎంక్వైరీ చేపట్టమని కోరినట్లు తెలుపుతూ, ప్రజలు తనను ఎలా ఉండాలి అని కోరుకున్నారో అలాగే ఉన్నానని, టీడీపీ హద్దులు మీరిన అసత్యాల ప్రచారం వలన తాను సీబీఐ ఎంక్వైరీ అడిగినట్లు, తప్ప చేయని తనకు సిబిఐ కార్యాలయం అయినా ఎమ్మార్వో కార్యాలయం అయినా ఒక్కటేనని, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో డబ్బు సంపాదన గావించి, ప్రజలకు సేవ చేస్తూన్నట్లు తెలిపారు. ఇకపై నారా లోకేష్ నుండి క్రింది స్థాయి టీడీపీ నాయకుల వరకు తన సంపాదనపై అసత్య ఆరోపణలు ప్రస్తావించనవసరం లేదని హెచ్చరించారు. రాబోవు రోజుల్లో టీడీపీ నాయకులు తనపై చేస్తున్న ఆరోపణలకు తగు ఆధారాలు ఉన్న యెడల సీబీఐ కి నివేదించవలసినదిగా ఆయన కోరారు. 2024లో జరగబోవు ఎన్నికలలో మరోమారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం తథ్యం అని జోస్యం తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, వరికూటి ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments