రాజంపేట : దళిత నాయకుడి పై దాడి హేయమైన చర్య - ఎమ్మార్పీఎస్
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగతో పాటు దళిత మహిళలపై గుంటూరు జిల్లా నగర పాలెం సిఐ హేమంత్ బాబు అసభ్య పదజాలంతో దూషించి దాడి చేయడం హేయమైన చర్య అని ఎమ్మార్పీఎస్ కడప, అన్నమయ్య ఉభయ జిల్లాల కన్వీనర్ వెలగచర్ల శివయ్య మాదిగ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్.పి ల ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ భవన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ దగ్గర ప్రధాన రహదారిలో బైఠాయించి నినాదాలు చేశారు.
అనంతరం ఈ మేరకు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెలగచర్ల శివయ్య మాదిగ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. 14 ఏళ్ళ దళిత బాలికను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద శాంతియుత దీక్షలు చేపట్టిన ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు దళిత మహిళలపై చేయి చేసుకోవడమే కాకుండా మహిళలపై చేతులేసి అనుచితంగా ప్రవర్తించిన సీఐ హేమంత్ బాబును వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దళిత బాలికను అత్యాచారం చేసిన అగ్రవర్ణానికి చెందిన కోవెలపూడి సాంబశివరావు చౌదరిని కఠినంగా శిక్షించి దళితుల మనోభావాలను సంరక్షించవలసినదిగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు వడ్డెర పెంచలయ్య, ఎం ఎస్ పి జిల్లా నాయకులు చేమూరు వెంకటేష్, మందా శివయ్య, జడ శివ, వంశి, తేజ, సాయి, వెంకీ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
コメント