సౌత్ జోన్ జాతీయస్థాయి పోటీలలో క్రీడాకారుల సత్తా
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ఆదివారం తిరుపతి నగరంలో విశ్వం హై స్కూల్ లో నిర్వహించిన సౌత్ జోన్ జాతీయస్థాయి టైక్వాండో పోటీలలో రాజంపేట పట్టణానికి చెందిన ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటారని గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ తెలియజేశారు. సోమవారం స్థానిక జిఎంసి ప్రాంగణంలోని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి వారికి పతకాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ సునీల్ మాట్లాడుతూ అకాడమీ నుంచి 19 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొనగా అద్భుత ప్రదర్శనతో అందరూ పతకాలు సాధించారని అన్నారు. 4 స్వర్ణ పతకాలు, 4 రజతం, 11 కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. తన శిక్షణలో అనేకమంది క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉన్నత చదువులకు సీటు పొందారని, ప్రభుత్వ ఉద్యోగాలను పొంది స్థిరపడ్డారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేసిందని.. అవకాశాలను వినియోగించుకుని యువత క్రీడలలో రాణించాలని అన్నారు. పెద్దలు ఎవరైనా తమ అకాడమీకి సహాయ సహకారాలు అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆరోగ్యము, శారీరక దారుడ్ధ్యము, మానసిక వికాసం తో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని ఆత్మరక్షణ పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహులు, సంయుక్త కార్యదర్శులు ఉమాశంకర్, వి.నరసింహులు, మాస్టర్లు టీ.చంద్రశేఖర్, కే.నాగరాజ, కే.గంగారామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments