సినీ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (53) కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్‌లో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆయన అనారోగ్యం బారినపడ్డారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో ఆయన పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్ రియాల్టీషోల ద్వారా కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఎన్నో విజయవంతమైన పాటలకు నృత్యాలు సమకూర్చారు. దాదాపు 1500లకు పైగా సినిమాలకు పనిచేశారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తరచూ ఇంటర్వ్యూలో ఇచ్చేవారు. పలు యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’షోలోనూ పలు ఎపిసోడ్స్‌లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్‌తో సహా పలువురు డ్యాన్స్ మాస్టర్లు రాకేశ్ మాస్టర్‌కు శిష్యులే. రాకేశ్ మాస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాతే డ్యాన్స్, స్టైల్ నేర్చుకున్నట్లు శేఖర్ మాస్టర్ పలు సందర్భాల్లో పంచుకున్నారు. రాకేశ్ మాస్టర్ మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Comments