స్టీల్ ప్లాంట్ ఒడి లో రామ లింగేశ్వరుడు
శ్రీ శ్రీ శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల కలల పంట, ఎందరో ఉద్యమకారుల పోరాటఫలం. వందలాది గ్రామాల్లో ఉన్న వేలాది ఎకరాలను స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తృణప్రాయంగా అతి చౌక గా త్యజించిన వేలాది నిర్వాసితుల త్యాగఫలం.
వందలాది గ్రామాల్లో ఉన్న వేలాది ఎకరాలు చదును చేసే క్రమంలో ఎన్నో దేవాలయాలు నేల మట్టమయ్యాయి. టౌన్షిప్ లో రెండు మూడు దేవాలయాల్ని మినహాయిస్తే మిగిలిన గుళ్లన్నీ తొలగించారు. ప్లాంట్ లోపల(కర్మాగారం) లో ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు తొలగించి ఉంటుడవచ్చు. అయినా గానీ ఇప్పటిక్కూడా ఒక శివాలయం ఉంది. FMD డిపార్ట్మెంట్ కి సమీపంలో ఒక కిలోమీటర్ దూరం లో మూడు రైల్వే పట్టాలు తర్వాత సువిశాల స్థలంలో శ్రీశ్రీశ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర ఆలయం ఉంది.
కార్తీక వెన్నెల రేడు, ఆ నీల కంటేశ్వరుడు, ఆ లయకారుడు ఈశ్వరుడు రామ లింగేశ్వరుడుగా కొలువుదీరి అశేష భక్తజనావళి పూజలందుకుంటున్నాడు. ఆ నాటి చరిత్రకు సాక్ష్యం గా, పచ్చని వృక్షాల మధ్య, పక్షుల కీలకీలరావాల గానామృతం నడుమ కొలువై ఉన్న శివాలయం చూడడానికి ముగ్ద మనోహరంగా ఉంటుంది. శివాలయంతో పాటు వినాయక, సుబ్రహ్మణ్యం, అయ్యప్ప, వేంకటేశ్వర స్వామి, నవ గ్రహాలు మరియు ఆంజనేయస్వామి గుళ్లు కూడా ఉన్నాయి.
ఇది ఒకప్పటి బాల చెరువు ప్రాంతం. ఆ గ్రామం వాస్తవ్యులతో పాటు, చుట్టు ప్రక్కల గ్రామాల వాళ్ళు కార్తీక మాసం లో ప్రత్యేకించి సోమవారాల్లో కుంటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. పాత బాలచెరువు ప్రాంతంతో పాటు చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాలతో ఉన్న తమ అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని తలచుకుంటూ భక్తులు ఆనంద పారవశ్యం లో మునుగుతుంటారు. భక్తులను బిసి గేట్ నుండి ఆధార్ కార్డ్ ధృవీకరణ తో ప్రతి సోమవారం ప్లాంట్ లోపల ఉన్న ఈ శివాలయానికి యాజమాన్యం అనుమతిస్తుంది. ప్రతీ కార్తీక మాసం లో నాల్గవ సోమవారం అన్న సమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లు, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు సుమారుగా ఐదు వేల మందికి పైగా హాజరవుతారనడం లో అతిశయోక్తి లేదు.
ప్రభుత్వాధీనంలో ప్లాంట్ నిర్మాణం జరిగింది కాబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ గుడి ని తొలగించకుండా ఉంచారు. రేపు ప్రైవేటీకరణ జరిగినా, పోస్కో లాంటి సంస్థలకు ప్లాంట్ భూములు ధారాదత్తం చేసిన ఇలాంటి దేవాలయాలు మనుగడలో ఉంటాయో లేదు ఆ భగవంతుడికే ఎరుక.
Comments