పసిడిపురి ముద్దు బిడ్డలకు పురసన్మానం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు పట్టణ స్థానిక వసంతపేట లోని బుశెట్టి కళ్యాణ మండపం నందు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి వారిచే గౌరవ డాక్టరేట్ స్వీకరించిన సిరిపురి ముద్దు బిడ్డలు అవధాన కవీంద్రులు డా. నరాల రామారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. ఇండ్ల రామసుబ్బా రెడ్డిలను ప్రొద్దుటూరు ఐక్య వివేదిక పక్షాన ఘనంగా సత్కరించి గౌరవించారు. కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డా. డి నాగ దస్తగిరి రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డిలు హాజరుకాగా, విశిష్ట అతిధిగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి హాజరు అయ్యారు, నటరాజ కళాక్షేత్రం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సృష్టిలోని బుద్ధిజీవులు, ఈ సమాజాన్ని ముందడుగు వేయిస్తూ, ప్రజలలో చైతన్య స్పూర్తిని నింపుతూ, నవ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, ప్రొద్దుటూరులో పుట్టి, ఇక్కడే పెరిగి, విద్యనభ్యసించి, సమోన్నతకీర్తిని, ఖండ ఖండాంతరాలలో వ్యాప్తి చేసి, ప్రొద్దుటూరుకే గర్వకారణమైన వారు డా|| నరాల రామారెడ్డి, డా॥ ఇండ్ల రామసుబ్బారెడ్డి అని, వీరిరువురి ప్రజ్ఞాపాటవాలను గుర్తించిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి వారు గౌరవ డాక్టరేట్ను అందజేశారని కొనియాడారు. ఇది పసిడిపురి ప్రొద్దుటూరు ప్రజలందరి విజ్ఞాన ఘన విజయంగా భావించాలని, ఇదో అద్భుత ఘట్టంగా వారు అభివర్ణించారు. వీరిరువురి పేరు ఆచంద్రతారార్కం విరాజిల్లుతూనే ఉంటుందని, ఇంతటి మహానుభావులకు పసిడిపురి పురసన్మానం చేసే సదవకాశాన్ని ప్రొద్దుటూరు ఐక్య వేదిక ముందుకు తీసురావటం ఎంతో సంతోషదాయకమని అన్నారు.
చదువుతో పాటు, ఆ చదువులలోని మర్మమగు ఆత్మ తత్వమును తెలుసుకోలేని చదువులన్నియు నిరర్ధకము అన్నమాట అక్షర సత్యం అని, అద్భుతమైన ఈ ఇరువురు మేధావులు చదువులోని అంత: మర్మాన్ని కనుగొని, విశ్వ వ్యాప్తంగా ప్రభవిల్లి, అశేష జనావళి ఆదరాభిమానాలను చూరగొన్న అద్భుత ప్రతిభాశీలులుగా, విద్య నెరిగిన మేధావి తన జ్ఞానాన్ని నలుగురితో పంచుకునే గొప్ప ఆశయం కలిగిన వీరు ఇరువురు ఇప్పటికే ప్రొద్దుటూరు పేరును విశ్వవ్యాప్తం చేశారన్నారు. ప్రొద్దుటూరులో జన్మించిన ఎందరో మహానుభావుల జాబితాలో వీరురివురు ఎప్పుడో చేరిపోయారని, వీరి అఖండ జ్ఞాన జ్యోతి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా వెలుగులను ప్రసరిస్తూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఐక్య వేదిక సభ్యులు, పట్టణ ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
Comments