కడప డిసిఎల్ ఆఫీస్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) కడప జిల్లా అధ్యక్షులు పీ చంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బరాయుడు, ప్రధాన కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కడప నగరంలోని పాత రిమ్స్ లో ఉన్న డిసిఎల్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో దాదాపు లక్ష మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, 65 వేల మంది కార్మికులు వెల్ఫేర్ బోర్డులో నమోదు చేసుకున్నారని వారు తెలిపారు.
కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు దాదాపు 2000 మంది గుర్తింపు కోసం బ్యాంక్ నుండి చలనాలు తీశారని, కానీ ఇప్పటివరకు వారందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమ శాఖ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాల నుండి భవన నిర్మాణ కార్మిక శాఖ పెండింగులో ఉన్న దరఖాస్తులు పరిష్కారానికి కనీసం సమావేశం కూడా జరపడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కార్మిక శాఖ అధికారులు స్పందించి తక్షణమే పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి భవన నిర్మాణ కార్మికుల ఖాతాల్లో పదివేల రూపాయలు జమ చేసేలా ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతూ సంక్షేమ పథకాల అమలును నిలిపివేసిందన్నారు.
దీని కారణంగా భవన నిర్మాణ కార్మికులకు అన్ని రకాల సహాయం నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ బోర్డు నిధులను తిరిగి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిసిఎల్ కు సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. దీనిపై డిసిఎల్ స్పందిస్తూ వారం రోజుల లోపల అందరికీ గుర్తింపు కార్డులు వచ్చేలా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లేనిపక్షంలో మార్చి 28 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెలో జిల్లాలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తారని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఓబులేసు, నాయక్, మరియమ్మ, మున్ని , ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులు ఖాదర్బాషా, మాధవ, చిన్న,దస్తగిరి, శ్రీను, రామచంద్రుడు, ప్రసాద్, నారాయణ, దేవదానంతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Comments