ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పలు చోట్ల అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లా చీరాల, ప.గో. జిల్లా భీమవరం, కాకినాడ, అమలాపురం, తుని, సీతానగరం, రామచంద్రాపురం, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం 6 గంటల నుంచి మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
అయితే రాష్ట్రవ్యాప్తంగా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గడం కరెంట్ కోతలకు కారణమని తెలుస్తోంది. వీటీపీఎస్, ఆర్టీపీపీ, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రాల్లో 1700 మెగావాట్ల మేర కరెంట్ ఉత్పత్తి తగ్గింది. దీంతో మూడు డిస్కంల పరిధుల్లో కరెంట్ నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కడప జిల్లా వరకు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా విద్యుత్ పునరుద్ధరణపై ఇంకా అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
Comments