వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బైపాస్ నందు మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహన చోధకురాలు మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే, చాపాడు మండల సర్వ శిక్ష అభియాన్ నందు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న బండారు సునీల రామేశ్వరం నివాసి. మంగళవారం ఉదయం విధులకు హాజరవ్వటానికి తన టీవీఎస్ జూపిటర్ నూతన వాహనంలో వెళుతూ... లారీ, రాయి లోడుతో వస్తున్న ట్రాక్టర్ నడుమన పడి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు.
కాగా ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బైపాస్ నందు గతంలో ఇలాంటి ఘటనలే అనేకం జరిగి ఉండగా, వేగ నియంత్రికలు సరిగా లేకపోవడం రోడ్డుకు ఇరువైపులా గుంతలు, పెచ్చులూడిన రోడ్డు కారణంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు స్పందించకపోవడం వాహనదారులకు శాపంగా మారింది. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రహదారిగా ఈ ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు నిలుస్తుంది. తరచూ వాహన చోదకులు అతివేగంగా తమ వాహనాలను నడపటం మితిమీరిన వేగంతో లారీలు, ట్రాక్టర్లు, పలు భారీ వాహనాలు బైపాస్ గుండా వెళ్ళటం ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన వేగ నియంత్రికలు ఏర్పాటు చేసి రోడ్డుకు ఇరువైపులా గుంతలు చదును చేయవలసిందిగా వాహన చోదకులు కోరుతున్నారు.
Comments