RRR @800/-
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరులో సినీ ప్రేక్షకులకు కొదవలేదు, అన్ని రకాల సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు, దశాబ్ధ కాలంగా ఇక్కడి పాత సినిమా హాళ్లు ఆధునీకరణ బాట పట్టాయి, కొత్తగా వెలసిన సినిమా హాళ్లు తో పాటు పాతవి అన్ని కలిపి రమారమి ఎనిమిది హాళ్లు ఉండగా ఏదయినా పెద్ద హీరోల సినిమాలు వస్తే దాదాపు అన్ని సినిమా హాళ్లలో ప్రదర్శించిన సందర్భాలు లేకపోలేదు. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల నియంత్రణలో అటు సఫలమయిందనో లేక విఫలమయిందనో చెప్పలేని పరిస్ధితి. ఏది ఏమయినా పెద్ద హీరోలు దర్శకుల సినిమాలకు టికెట్ ధరల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు.
తాజాగా రేపు విడుదల కాబోతున్న RRR సినిమా ధరలు ఆకాశాన్నంటాయి, ఇక్కడి సినిమా హాళ్ల యాజమాన్యం బెనిఫిట్ షో ధరలు అమాంతంగా పెంచేశారు, ప్రస్తుతం ఒక్కో టికెట్ ధర 800ల రూపాయలుగా విక్రయిస్తున్నారు. సగటు ప్రేక్షకునికి అందులోనూ ఆ సినిమాలో నటించిన హీరో అభిమానులకి ఇది భారీ మొత్తం అనే చెప్పాలి, డబ్బులు ఉన్న బాబులు కొందరికి ఇది చిన్న మొత్తం గాను, సగటు ప్రేక్షకునికి అదే టికెట్ ధరకు ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఒక నెలకి సరిపడా కొనుగోలు చేసే విధంగాను ఉంది. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో దర్శకుడు తనలోని ప్రతిభను కధా బలాన్ని బట్టి పెద్ద హీరోలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి అటు గ్రాఫిక్స్ ఇటు సాంకేతికత మేళవించి, అటు అభిమానులలో ఇటు సగటు ప్రేక్షకునిలో ఒకింత హైప్ క్రియేట్ చేసి సినిమా విడుదలకు ముందే నిర్మాత పెట్టిన ఖర్చులు వసూలు చేసిన ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు. కొత్తగా విడుదల కోబోతున్న తమ అభిమాన నటుడి సినిమా కోసం అభిమానులు అత్యధిక మొత్తంలో డబ్బులు వెచ్చించక తప్పదు అనే తెలపాలి. ఇకపోతే అభిమానులు తమ ఆర్ధిక స్థోమతను బట్టే హీరోను అభిమానించాలి అనేదానికి కూడా ఇది సంకేతం ఏమో! ప్రొద్దుటూరు లాంటి పట్టణాలలో RRR సినిమాలో నటించిన తారలకు అభిమానుల కొదవలేదు, కానీ చాలా మంది మధ్యతరగతి ప్రేక్షకులు ఇక్కడ ఉండగా కొందరు అంతోటి ధరలు వ్యచ్చించి టికెట్ కొనలేక పోయిన వారు లేకపోలేదు, కొందరు 800 రూపాయలకు తమ ఇంటికి కావలసిన నెలవారీ పచారీ సామాగ్రి వస్తుంది కదా అని వెనకడుగు వేస్తుండగా, కొందరు నెల ఆఖరు కావటంతోనూ, మరికొందరు తీరిగ్గా ధరలు తగ్గిన తరువాత ఇంటిళ్లిపాదికి ఈ ధరలతో సినిమా చూడవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. కొందరు అభిమానులకు నామాటలు కటువుగా అనిపించినా సగటు అభిమాని ప్రేక్షకుడి ఆవేదన నేను తెలియచేసాను.
Comments