top of page
Writer's picturePRASANNA ANDHRA

రోజుకు మూడుసార్లు ఎస్సార్

రోజుకు మూడుసార్లు ఎస్సార్


ప్రొబేషన్‌ ఖరారులో ఇప్పటికే జాప్యంతో అవస్థలు పడుతున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు మరో కొత్త సమస్యను ఎదుర్కోబోతున్నారు.ఏ ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ లేని విధంగా రోజులో మూడు సార్లు హాజరు తప్పనిసరి చేసే కొత్త విధానం సచివాలయాల్లో సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇందు కోసం ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చింది. దీన్ని ఉద్యోగులు తమ స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని సోమవారం నుంచి మూడు సార్లు హాజరు వేసుకోవాలి. ఉదయం 10 గంటల్లోపు, మధ్యాహ్నం 3కు, సాయంత్రం 5 గంటలకు హాజరు తప్పనిసరి. సొంత ఫోన్లు లేనివారు సచివాలయాలకు ప్రభుత్వం కేటాయించిన స్మార్ట్‌ ఫోన్లు ఉపయోగించుకోవాలి. ఈ ఆదేశాలతో ఉద్యోగుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది. 2019 అక్టోబరులో విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ 2021 అక్టోబరులో ఖరారు చేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో చాలా మంది ఉత్తీర్ణులు కాలేదన్న ఉద్దేశంతో 2022 జూన్‌లో అందరి ప్రొబేషన్‌ ఒకేసారి ఖరారు చేయాలని అధికారులను సీఎం కొద్ది నెలల క్రితం ఆదేశించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో చాలామంది ఉద్యోగులు ఉత్తీర్ణులు కాలేదు. దీంతో ప్రొబేషన్‌పై నీలినీడలు అలముకొని వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు పూటలా బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయడంతో వీరంతా ఆవేదన చెందుతున్నారు. ఈ విధానం అమలుకు సంబంధించి ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. శనివారం నుంచి అమలు కోసం రెండు రోజుల క్రితం యాప్‌ని విడుదల చేసి ఉద్యోగుల స్మార్ట్‌ ఫోన్లులో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.


'స్పందన'కు హాజరు తప్పనిసరి చేస్తున్నాం : అధికారులు


మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు ప్రతిరోజూ సచివాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి ఉద్యోగులంతా విధిగా హాజరవ్వాలన్న ఉద్దేశంతో మూడు పూటలా హాజరు తప్పనిసరి చేశామని అధికారులు చెబుతున్నారు. 'చాలామంది ఉదయం హాజరు వేసుకొని క్షేత్రస్థాయి పర్యటనల పేరుతో సాయంత్రం వరకు బయట ఉండి సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్లీ రెండోసారి హాజరు వేస్తున్నారు. ఈ కారణంగా 'స్పందన'లో ప్రజలు ఇచ్చే వినతులకు సమాధానం చెప్పేవారు ఉండడం లేదు. ఈ రెండు గంటలూ ఉద్యోగులంతా విధిగా సచివాలయాల్లో ఉండాలనే ఉద్దేశంతో మూడు పూటలా హాజరు పెట్టాం' అని సచివాలయశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


ఒత్తిడి పెంచడమే : ఉద్యోగులు


ఏ ఇతర ప్రభుత్వశాఖల్లోనూ అమలు చేయని విధానాన్ని కేవలం సచివాలయాల్లో ప్రవేశ పెట్టడం ఉద్యోగులను ఒత్తిడికి గురి చేయడమేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'ప్రొబేషన్‌ ఖరారులో జాప్యం వల్ల అరకొర వేతనాలతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. ఈ సమస్యకో పరిష్కారం చూపకపోగా.. మూడుసార్లు హాజరు తప్పనిసరి చేయడం వేధింపులకు గురి చేయడమే' అని ఉద్యోగుల సంఘం నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

42 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page