తిరుప్పూరు జిల్లాలోని ఓ ఆలయ మూలవిరాట్టును హాజరుపరచాలంటూ దిగువ కోర్టు సమన్లు జారీచేసిన వైనంపై మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడికే సమన్లు జారీ చేయడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తిరుప్పూరు జిల్లా శివిరిపాళయం పరమశివన్ ఆలయంలోని మూలవిరాట్టు గతంలో చోరీకి గురైంది. పోలీసులు ఆ విగ్రహం ఆచూకీని కనుగొని దానిని ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. ఎప్పటిలానే ఆ విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు. ఈ పరిస్థితులలో విగ్రహాల చోరీకేసులపై విచారణ జరుపుతున్న కుంభకోణం ప్రత్యేక కోర్టు న్యాయాఽధికారి ఆ ‘మూలవర్’ను ఈ నెల 6వ తేదీన తమ ఎదుట హాజరుపరచాలంటూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సమన్లను సవాల్ చేస్తూ ఆలయ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. చోరీకి గురైన ఆ విగ్రహాన్ని ఆగమ నియమాల ప్రకారం ఆలయంలో ప్రతిష్ఠించి సంప్రోక్షణలు కూడా పూర్తి చేసిన నేపథ్యంలో కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేయడంపై హైకోర్టు న్యాయమూర్తి ఆర్.సురే్‌షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే ఓ అడ్వకేట్ కమిషనర్ ద్వారా మూలవిరాట్టును పరిశీలింపజేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. మూలవిరాట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భాలయం నుంచి బయటికి తీసుకెళ్లరాదని తేల్చిచెప్పారు.
Commentaires