కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలి
అధికారులు శ్రీ చైతన్య ఆగడాలను అరికట్టాలి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట :
శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్న ఆగడాలను నిరసిస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపడుతున్న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి తెలియజేశారు. ఆదివారం ఆర్.ఎస్ రోడ్డులో గల ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థలు అధిక ఫీజుల వసూళ్లతో తల్లిదండ్రులను నిలువునా దోపిడీ చేస్తున్నా, పరిమితికి మించి బస్సులలో విద్యార్థులను తరలించి వారి ప్రాణానికే ముప్పు కలిగేలా వ్యవహరిస్తున్నా, సరియైన క్రీడా ప్రాంగణం కూడా లేకుండా విద్యార్థుల మానసిక, శారీరక స్థితిగతులతో చెలగాటమాడుతున్నా ఏ అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన చెందారు. పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారని.
విద్యను వ్యాపారంగా మార్చిన శ్రీ చైతన్య పాఠశాలల ఆగడాలను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రాజంపేట తో సహా మదనపల్లి, పీలేరు లోని శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని లేదంటే పాఠశాలల ఎదుట ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. శ్రీ చైతన్య పాఠశాలల ఆగడాలకు నిరసనగా చేపడుతున్న కలెక్టరేట్ వద్ద ధర్నాకు విద్యార్థి సంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నాయకులు కార్తీక్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
Comentarios