top of page
Writer's pictureEDITOR

పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి రైలు ఆపాలి - వామపక్ష నాయకులు

పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో ప్రతి రైలు ఆపాలి - వామపక్ష నాయకులు

సమావేశంలో ప్రసంగిస్తున్న రవికుమార్, నరసింహ

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయిన రాజంపేటలో ప్రతి రైలును ఆపాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలు రవికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ సర్వేపల్లి డిమాండ్ చేశారు. వారు గురువారం స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఐన రాజంపేట రైల్వేస్టేషన్లో కనీసం ప్యాసింజర్లు , వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లకు మాత్రమే పరిమితమవడం తప్ప మరో రైలు స్టాపింగ్ లేదన్నారు. పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రాజంపేట పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఆపకపోవడానికి ప్రధాన కారకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే కారణమని అన్నారు.


బ్రిటిష్ కాలం నుండి అనేక ఎక్స్ప్రెస్ లు, సూపర్ ఫాస్ట్ లు ఆపుతున్న సందర్భంలో జిల్లా బైపరికేషను సందర్భంగా రాజంపేట పార్లమెంటు కోటలో ఏ ఒక రైలు ఆగడం లేదన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్ లో వైద్య కళాశాల కట్టాలని చెప్పినప్పటికీ కళాశాలను మదనపల్లికి తరలించుకోవడం, జిల్లా కేంద్రాన్ని రాజంపేట కాకుండా రాయచోటికి తరలించడం పాలకుల నిర్లక్ష్య ధోరణి తప్ప మరొకటి కాదన్నారు. రాజంపేట ప్రజానీకం దగ్గరలో తిరుగుబాటు చేయడానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. పదేపదే రాజంపేట ప్రజానీకాన్ని పాలకులు దగా చేయడం తప్ప ఏ విషయం లోనూ న్యాయం చేయడం లేదన్నారు. జిల్లా పోయింది, వైద్య కళాశాల పోయింది, ప్రభుత్వ కార్యాలయాలు పోయాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే రాజంపేట ప్రాంతం ఎడారి ప్రాంతంగా మార్చే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కంకణం కట్టుకున్నారన్నారు. తక్షణమే ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి ప్రతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందాయని అన్నారు. స్టేషన్ అవతల ఉన్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడానికి సంవత్సరాలు తరబడి చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాజంపేట నియోజకవర్గానికి జరుగుతున్న దగా పైన సిఐటియు, ఎస్ఎఫ్ఐ ఐక్య కార్యచరణ ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.

8 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page