సమాచార హక్కు చట్టాన్ని నీరు కారుస్తున్న పెనగలూరు మండల రెవెన్యూ అధికారులు
అన్యాక్రాంతమైన భూమిని పేదలకు పంపిణీ చేయాలి
ఎస్ ఎఫ్ ఐ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
పెనగలూరు మండలంలో కొండూరు గ్రామపంచాయతీ, వెలగచర్ల వెంగమాంబ పురం రెవిన్యూ గ్రామ పరిధిలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూముల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా రెండు నెలల నుండి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సమయాన్ని వృధా చేస్తూన్నారని.. రెవెన్యూ అధికారులు నిజంగానే తప్పు చేయకుండా ఉంటే సమాచార హక్కు చట్టం ప్రకారం వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని, సమాచార హక్కు చట్టాన్ని పెనుగులూరు రెవిన్యూ అధికారులు నీరుగారుస్తున్నారని ఎస్ ఎఫ్ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ ఆరోపించారు.
గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండల తహసిల్దారు, సర్వేయరు కలిసి ప్రభుత్వ భూములను సబ్ డివిజన్ చేసి అడంగల్ లో, రికార్డులలో పేర్లు ఎక్కించడానికి లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేదలకు భూపంపిణీ అమలు చేయవలసిన అధికారులు కొంతమంది అధికార పార్టీ చెప్పిందే వేదం అంటూ వాళ్ళ అడుగులకు మడుగులు నొక్కుతూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కొండూరు గ్రామపంచాయతీ లోని వెలగచర్ల , వెంగమాంబపురం రెవెన్యూ పరిధిలో వేల ఎకరాలు కొంతమంది చేతుల్లో వుందని.. దీనిని వెంటనే రి సర్వే చేపట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని అన్నారు. ఆక్రమిత భూములపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కావాలని కోరినా మండల తహసిల్దార్ నేటికీ 3 నెలలు పూర్తి కావస్తున్నా సమాచారం ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
గత పది సంవత్సరాలుగా పేదలకు అసైన్డ్ భూములు పంపిణీకి నోచుకోలేదని, అనర్హులకు మాత్రం రాత్రికి రాత్రే పట్టాలు, పాస్ బుక్కులు అందుతున్నాయని ఆరోపించారు. భూ పంపిణీకి సంబంధించి మండల తహసిల్దారులు ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లకు మాత్రమే అసైన్మెంట్ కమిటీలో పెడుతున్నారని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి అసైన్మెంట్ కమిటీలో ఆమోదించాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు లక్ష్మీనారాయణ, పెంచలయ్య పాల్గొన్నారు.
Comments