శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకైన శ్రీశైల క్షేత్రంలో కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా చైత్ర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి గుమ్మడి కాయలు, నిమ్మకాయలు సాత్విక బలిగా సమర్పిస్తారు. కార్యక్రమం సందర్భంగా ఆలయానికి నిమ్మకాయలతో అలంకరణ చేశారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి.
ఉదయం 7.30 గంటలకు మొదటి విడుత సాత్విక బలులు సమర్పించనున్నారు. సాయంత్రం స్త్రీ వేషధారణలో అమ్మవారికి కుంభహారతి సమర్పించనున్నారు. ఆ తర్వాత పలు రకాల వంటలతో మహా నివేదన చేయనున్నారు. మరో వైపు దేవాదాయ చట్టం ప్రకారం క్షేత్ర పరిధిలో జంతువులు పక్షులు బలులను నిషేధించారు. కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కల్యాణోత్సవం, ఏకాంత సేవ మంగళవారం నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
Comments