top of page
Writer's pictureEDITOR

పది పరీక్షలు తేలికే... విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు


పది పరీక్షలు తేలికే...

తెలుగు ఉపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాతృభాష తెలుగు కు దూరమై ఉత్తీర్ణత సాధించడంలో అవస్థలు పడుతున్నారని.. మాతృభాష తెలుగుతో ఆరంభమయ్యే ఈ పరీక్షల్లో ప్రణాళిక బద్ధంగా చదివితే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందడంతో పాటుగా అత్యధిక మార్కులు కూడా సంపాదించవచ్చునని.. అందులో ప్రథమ పరీక్ష తెలుగును ఆత్మవిశ్వాసంతో బాగా రాసినట్లయితే అది తర్వాతి పరీక్షకు ప్రేరణ అవుతుందని తెలుగు పండితులు, ఉమ్మడి కడప జిల్లా పరీక్షల మండలి రచయిత గంగనపల్లి వెంకటరమణ తెలియజేస్తున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే...

తెలుగులో అత్యధిక మార్పులు సంపాదించడం తేలికే


మొత్తం 100 మార్కులకు జరిగే ఈ పరీక్షలో మూడు విద్యా ప్రమాణాల ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను మదింపు చేస్తారు. అందులో

1. అవగాహన - ప్రతిస్పందన (32 మార్కులు)

2. వ్యక్తీకరణ - సృజనాత్మకత (36మార్కులు)

3. భాషాంశాలు (32మార్కులు) ఉంటాయి.


మొదటి విద్యా ప్రమాణమైన అవగాహన - ప్రతిస్పందనలో మొత్తం నాలుగు వ్యాసరూప సమాధానం ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్కదానికి 8 మార్కులు చొప్పున మొత్తం 32 మార్కులు.

ఇందులో 1వ ప్రశ్న ప్రతిపదార్థానికి సంబంధించిన ప్రశ్న. ఏవేని రెండు పాఠ్యాంశాల నుండి రెండు పద్యాలను ఇచ్చి అందులో ఒకదానికి ప్రతిపదార్థం రాయమంటారు. పద్యంలోని అన్ని పదాలకు సరైన అర్థాలు రాసినందుకు 6 మార్కులు. అన్వయ క్రమాన్ని పాటిస్తూ క్రియా పదంతో ముగించినందుకు 2 మార్కులు. దీనికోసం ముఖ్యంగా మాతృభావన, వెన్నెల, భిక్ష అనే పాఠాలలోని ముఖ్యమైన పద్యాలను విద్యార్థులు తర్ఫీదు పొందితే ఒకటి రాయవచ్చు.

2వ ప్రశ్న పద్య పూరణ, భావానికి సంబంధించినది. ఏవేని రెండు పాఠ్యాంశాల నుంచి అడిగిన రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయమంటారు. ప్రాస నియమంతో కూడిన పద్యం రాసినందుకు 4మార్కులు, సరైన భావం రాసినందుకు 4మార్కులు. మొత్తం 8మార్కులు. దీని కోసమై విద్యార్థులుశ తక మధురిమ పాఠంలోని పద్యాలను తర్ఫీదు పొందితే ఒకటి రాయవచ్చు.


3వ ప్రశ్నగా రామాయణంలోని బాల, అయోధ్యకాండలలో ఏదో ఒక కాండ నుండి అడిగిన నాలుగు వాక్యాలను వరుస క్రమంలో రాయాలి. 8 మార్కులు ఉంటాయి. దీనికై విద్యార్థులు బాల, అయోధ్య కాండలలోని కథను పూర్తిగా అర్థం చేసుకుంటూ చదివి ఉండాలి. అప్పుడే ఇచ్చిన వాక్యాలను వరుస క్రమంలో తేలికగా రాయగలరు.


4వ ప్రశ్నగా ఏదేని ఒక అపరిచిత గద్యాన్ని ఇచ్చి 4 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2మార్కుల చొప్పున మొత్తం 8మార్కులు. అందులో మూడింటికి ఇచ్చిన గద్యంలోనే సమాధానాలుంటాయి. ఒక ప్రశ్నను విద్యార్థులు తయారు చేయాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులు గద్యాన్ని 3 లేదా 4 మార్లు నిదానంగా అర్థం చేసుకుంటూ చదివిన తర్వాతే ప్రశ్నలకు సమాధానం రాస్తే పూర్తి మార్కులు సంపాదించవచ్చు.


రెండవ విద్యా ప్రమాణమైన వ్యక్తీకరణ - సృజనాత్మకతలో మూడు ప్రశ్నలు లఘు సమాధానాలవి, మరో మూడు ప్రశ్నలు వ్యాసరూప సమాధానాలవి. లఘు సమాధానానికి 4మార్కుల చొప్పున 12 మార్కులు. వ్యాసరూప సమాధానానికి 8 మార్కులు చొప్పున 24 మార్కులు. మొత్తం 36 మార్కులు.


ఇందులో 5వ ప్రశ్న కవి కాలాదులకు సంబంధించినది. దీనికోసం విద్యార్థులు పద్యభాగ పాఠ్యాంశాలలోని శతక మధురిమను మినహాయించి మిగతా పాఠాల కవి కాలాదులను చదివి ఏవేని నాలుగు అంశాలను రాస్తేసరిపోతుంది. 6వ ప్రశ్నగా గద్యభాగ పాఠ్యాంశాల ప్రక్రియలు, నేపథ్యాలను చదివితే ఏదో ఒకటి వస్తుంది. 7వ ప్రశ్నగా రామాయణంలో చివరగా ఇచ్చిన పాత్రలను చదివి ఆయా పాత్రల 4 గుణాలను రాస్తే సరిపోతుంది. కథాంశం రాయకూడదు.


8వ ప్రశ్న గద్య పాఠ్యాంశాల నుండి ఏవేని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయమంటారు. దీనికోసం జానపదుని జాబు, గోరంత దీపాలు, చిత్రగ్రీవం పాఠాలలోని వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో ఒకటి వస్తుంది. 9వ ప్రశ్నగా రామాయణం నుండి అడిగిన ఏవేని రెండు ప్రశ్నలలో ఒకదానికి సమాధానం రాయాలి. దీనికోసం పాఠ్యపుస్తకంలో ఇచ్చిన ప్రశ్నలను చదివితే రాయవచ్చు. 10వ ప్రశ్నగా పద్య, గద్యపాఠ్యాంశాలలోని సృజనాత్మక ప్రశ్నలను చదవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా లేఖకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు తర్ఫీదు చేయాలి. ఇవన్నీ ఎనిమిది మార్కుల ప్రశ్నలు. ఇక్కడ విద్యార్థులురాసే పదజాలానికి, వాక్య నిర్మాణానికి, విషయానికనుగుణంగా మార్కులుంటాయి. దోషరహితంగా రాసిన సమాధానాలకు ఎక్కువ మార్కులు వస్తాయి.


మూడవ విద్యా ప్రమాణమైన భాషాంశాలకు సంబంధించిన ప్రశ్నల్లో... ముఖ్యంగా

ఇచ్చిన వాక్యంలోగల అలంకారాన్ని గుర్తించి రాయాలి. ఇక్కడ అలంకారం పేరు రాసినందుకు 2 మార్కులు. పద్య పాదానికి గురులఘువులు గుర్తించి గణవిభజనచేసి ఏ పద్యపాదమో రాయాలి. లఘు గురువులు గుర్తించి గణ విభజన చేసినందుకు 1మార్కు, పద్యం పేరు రాసినందుకు 1 మార్కు. అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులకు సంబంధించి ఒక్కో దానికి రెండేసి ప్రశ్నలుంటాయి. వాటిలో ఒక ప్రశ్నకు నేరుగా సమాధానం రాయాల్సి ఉండగా, మరో ప్రశ్నకు బహుళైఛ్ఛిక సమాధానాలలో ఒకదాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఒక సంధి పదాన్ని విడదీయడం, మరో పదాన్ని కలపడం, ఇంకో దానికి సంధి పేరు రాయడం చేయాలి. సమాస పదానికి విగ్రహవాక్యం రాయడం, మరో పదానికి ఏ సమాసమో తెల్పడం, ఇచ్చిన సమాసానికి తగిన పదం గుర్తించి రాయడం చేయాలి. జాతీయాలకు సంబంధించి మూడు ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం 6మార్కులు. ఇందులో మొదట ప్రశ్నకు ఇచ్చిన వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి రాయాలి. తర్వాత ఇచ్చిన జాతీయాన్ని విద్యార్థులు సొంతవాక్యంలో ప్రయోగించి రాయాలి. అంటే ఇచ్చిన జాతీయాన్ని రాసే వాక్యంలో ఇమిడిపోయేలా చూసుకోవాలి. మూడవ ప్రశ్నగా ఇచ్చిన జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయాలి. అంటే ఇచ్చిన జాతీయానికి ఏ అర్థం వస్తుందో, దానిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో రాయాలి. ఆధునిక వచనాన్ని బహుళైఛ్ఛిక సమాధానాలలో గుర్తించడం చేయాలి. ఇచ్చిన వ్యతిరేకార్థక వాక్యం మొదట ఏ కాలంలో ఉందో గుర్తించి అదే కాలంలోకి వ్యతిరేకం రాయాలి. అంటే భూతకాలంలో ఉంటే భూతకాలంలోకి, వర్తమాన కాలంలో ఉంటే వర్తమానకాలంలోకి భవిష్యత్తుకాలంలో ఉంటే భవిష్యత్తుకాలంలోకి రాయాలి. వ్యతిరేకార్థాన్నిచ్చే క్రియను గుర్తించి రాయమనే ప్రశ్నలో చూడక, చేయక, తినక... వంటి పదాన్ని గుర్తించి రాయాలి. కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా మార్చి రాసేటప్పుడు ఆయా నియమాలను తెలుసుకుని రాయాలి. చివరగా ఇచ్చిన వాక్యాలు ఏ రకమైన సామాన్య వాక్యాలో రాయమని అడుగుతారు. ఇందులో సంశ్లిష్ట వాక్య రకాలైన క్తా ్వర్థకం, శత్రర్థకం,ళచేదర్థకం, అప్యర్థకం వాక్యాలలాంటి ప్రశ్నలు అడగరు. సామాన్య వాక్యాల్లోని ప్రశ్నార్థక వాక్యం, సామర్ధ్యార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, విధ్యర్థకవాక్యం, ఆశీరర్థక వాక్యం మొదలగునవి ఉంటాయి.


ఆందోళన చెందకుండా అతివిశ్వాసం లేకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే... అమ్మ భాష తెలుగులో అత్యధిక మార్కులు సంపాదించడం తేలికే.

111 views1 comment

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 05, 2023
Rated 5 out of 5 stars.

Useful

Like
bottom of page