top of page
Writer's pictureEDITOR

అక్రమార్కుల చెరలో నక్షత్ర తాబేళ్లు

ప్రకాశం జిల్లా, కనిగిరి, చిట్టడవులు, ఎర్రటి నేలలు, రాళ్ల గుట్టల్లో నివసించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అక్రమార్కుల చేతుల్లో చిక్కి విదేశాలకు తరలిపోతున్నాయి.


వాటి నివాసానికి అనువైన వాతావరణం పశ్చిమ ప్రకాశంలోనే ఉండటంతో స్మగ్లర్ల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందా వల్ల వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాబేళ్ల అక్రమ రవాణాపై అధికారుల తనిఖీలు తూతూమంత్రంగా సాగడం అక్రమార్కులకు ఊతంగా మారింది. ఇటీవల నెల్లూరు జిల్లా తడ వద్ద ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తరలిస్తున్న 250 నక్షత్ర తాబేళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన పోలీసు అని తెలిసి అందరూ అవాక్కయ్యారు.


ఇక్కడే అధికం...

కనిగిరి ప్రాంతంలో నక్షత్ర తాబేళ్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. నియోజకవర్గంలోని కనిగిరి, పునుగోడు, యడవల్లి, చల్లగిరగల, వేములపాడు, సీఎస్‌పురం, వెలిగండ్ల, మాలకొండ అడవులు, అయ్యనకోట, బోడవాడ, బొట్లగూడూరు, కంభాలదిన్నె, లక్ష్మక్కపల్లి, శంకరాపురం, లోదుర్గంతో పాటు మర్రిపూడి, పొన్నలూరు, కొనకనమిట్ల మండలాల్లో వీటి సంఖ్య అధికంగా ఉంది.

అవసరాలు అనేకం...

వీటిని విష్ణుమూర్తి అవతారంగా భావించి కొందరు ఇళ్లలో పెంచుకుంటారు. పలు వ్యాధుల నివారణకు మంచిదని మరికొందరు వీటి మాంసం తింటారు. అదేవిధంగా వీటి పైభాగాన ఉండే చిప్పలు మందుల తయారీకి ఉపయోగిస్తుండటంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇదే ఆసరాగా స్మగ్లర్లు స్థానికులను దళారులుగా మార్చి నక్షత్ర తాబేళ్లను వేటాడిస్తున్నారు. వాటిని చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు అక్కడి నుంచి బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.


ఇక్కడ రూ.500... అక్కడ రూ.4 వేలు...

నక్షత్ర తాబేళ్లను వ్యాధుల నివారణ మందుల తయారీలో ఉపయోగిస్తుండటంతో బంగ్లాదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన కొందరు అక్రమార్కులు వీటి రవాణాను ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో వేటగాళ్లను నియమించుకొని ఒక్కో తాబేలుకు రూ.500 వరకు చెల్లిస్తున్నారు. ఇతర దేశాల్లో ఒక్కోదాన్ని సుమారు రూ.నాలుగు వేల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.


అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

నక్షత్ర తాబేళ్లు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రెండేళ్ల క్రితం కనిగిరిలోనే బంగ్లాదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన నలుగురు స్మగ్లర్లను పట్టుకుని జైలుకు పంపార. నెల్లూరు జిల్లా తడ వద్ద స్వాధీనం చేసుకున్న తాబేళ్ల విషయంపై వివరాలు సేకరిస్తున్నాం. కొండ ప్రాంతాల్లోని గిరిజన గూడేల్లో దండోరా వేయించాం. అరుదైన జాతి అయినప్పటికీ వీటి రక్షణకు ప్రభుత్వం ఎటువంటి నిధులు వెచ్చించడం లేదు. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం అని కనిగిరి అటవీశాఖ అధికారి రామిరెడ్డి తెలిపారు.

29 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page