పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దు..
--బాల్య వివాహరహిత భారతదేశ కార్యక్రమంలో
ఉమామహేశ్వర్ రెడ్డి.
చక్కగా చదువుకొని మానసిక, ఆరోగ్య, శారీరక ఎదుగుదలతో పాటు విద్యను అభ్యసించే వయసులో ఆడపిల్లలకు వివాహాలు చేసి వారి జీవితాన్ని నరకప్రాయం చేయవద్దని, అతిక్రమించిన వారు శిక్షార్హులవుతారని చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ వైసిపి సీనియర్ నాయకులు చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వెలుగు మరియు ఐసిడిఎస్ పరిధిలో సంయుక్తంగా చేపట్టిన "బాల్య వివాహాల రహిత భారత దేశం" కార్యక్రమంలో తాను పాల్గొన్నారు. ప్రభుత్వ వివాహ చట్టం ప్రకారం బాలికలు 18 సంవత్సరాలు, బాలురు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేసుకోవాలని అన్నారు.
వివాహ వయసు లోబడి జరిగే చట్టరహిత బాల్య వివాహాలను ప్రతి ఒక్కరు అరికట్టాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల అరికట్టాలని నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ నుంచి వైయస్సార్ విగ్రహం వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తూ అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పలు పథకాలను రూపొందించిందని కొనియాడారు. తదుపరి ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి,వెలుగు ఏపీవో చంద్రకళ లు మాట్లాడుతూ
ఇప్పటికే చైల్డ్ హెల్ప్ లైన్ 1098, పోలీస్ 100, ఉమెన్ హెల్ప్ లైన్ 181 ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి ఎక్కడికక్కడ బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుందన్నారు. ప్రతి స్వయం సహాయక సంఘం మహిళ బాల్య వివాహ రహిత భారతదేశం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శేషం రాజు, ఐసిడిఎస్ గ్రేడ్ 2 సూపర్వైజర్ సురేఖ రాణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, వెలుగు సీసీలు, వివో ఏలు స్వయం సహాయక సంఘ సభ్యులు,అంగన్వాడి టీచర్లు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, చిట్వేల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments