top of page
Writer's pictureMD & CEO

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు - ఆర్టికల్

నేడు సంక్రాంతి, సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు


సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.


1. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించిందట !


2. సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు. శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు. దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. ఇంకేముంది! తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.


3. కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.


4. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ! దీనికి కూడా ఓ కథ చెబుతారు. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.


5. సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు. ఇవండీ సంక్రాంతి గురించి ఓ అయిదు కథలు. ఇంకా గొబ్బెమ్మలు దగ్గర నుంచి భోగిపళ్ల వరకు... సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికీ ఓ కథ ఉంది.

6 views0 comments

Comentários

Avaliado com 0 de 5 estrelas.
Ainda sem avaliações

Adicione uma avaliação
bottom of page