భూమి కోసం సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
పెట్రోల్ తో నిప్పంటించుకుంటామని సర్పంచ్ కుటుంబం వేడుకోలు
ప్రసన్న ఆంధ్ర రాజంపేట
ఆక్రమించుకున్న భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా భూమి జోలికొస్తే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటామని సర్పంచ్ మరియు అతని కుటుంబం బోరున విలపించారు. వివరాల్లోకి వెళితే...
మండల పరిధిలోని వరదయ్య గారి పల్లె సర్పంచ్ శ్రీహరి తిప్పాయపల్లె పొలం సర్వేనెంబర్ 619 పట్టా స్థలంతో పాటు ప్రభుత్వం దళితులకు ప్రతిపాదించిన కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసి సాగు చేసుకుంటున్నారు. దీంతో శనివారం రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మనస్థాపం చెందిన సర్పంచ్ శ్రీహరి మరియు అతని కుటుంబ సభ్యులు ఆ భూమిలో అరటి తోటను సాగు చేసుకుంటున్నామని, పంట తొలగిస్తే తీవ్రంగా అప్పుల పాలై కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన చెంది రెవెన్యూ అధికారుల కాళ్లు పట్టుకొని ప్రాధేయపడేందుకు యత్నించారు. వందల ఎకరాలను ఆక్రమించుకున్న బడా భూ బకాసురులను వదిలి తనపై రెవెన్యూ అధికారులు జులూం ప్రదర్శించడం దారుణమని ఆవేదన చెందారు. తాను సర్పంచ్ కావడం చేత రాజకీయంగా గిట్టని వారు తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని మనస్తాపం చెందారు. వరుసగా అన్ని ఆక్రమణలు తొలగించిన పిదప తనపై చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రాధేయపడ్డారు. పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుంటామని అధికారుల వద్ద హల్ చల్ చేశారు. విషయం తారస్థాయికి చేరడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు యత్నిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలియజేశారు.
అధికారుల తీరు దారుణం
ఆక్రమిత భూముల పేరుతో సర్పంచ్ కుటుంబాన్ని వేధించడం తగదు - జంబూ సూర్యనారాయణ
భూముల ఆక్రమణ పేరుతో సర్పంచ్ కుటుంబాన్ని వేధించడం తగదని, అధికార పార్టీకి చెందిన సర్పంచ్ శ్రీహరిని అధికారులు చొక్కా పట్టుకుని లాక్కెల్లడం ఎంతవరకు సమంజసం అని సర్పంచుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి జంబు సూర్యనారాయణ శనివారం సర్పంచ్ శ్రీహరి పట్ల అధికారులు, పోలీసుల తీరుపై స్పందించారు. మండలంలో ఆక్రమణకు గురైన భూములు వందలాది ఎకరాలలో ఉన్నాయని, ముందు వాటి సంగతి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలే గాని చొక్కా పట్టుకుని కుటుంబం మొత్తం తలెత్తుకోలేని విధంగా పోలీసులు, అధికారులు వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అవమానభారంతో సర్పంచ్ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్ పట్ల అధికారులు ఇంతటి దురుసుగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. జరిగిన వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఉమ్మడి జిల్లాల సర్పంచుల సంఘానికి తెలిపి సంబంధించిన పై చర్యలు చేపట్టేందుకు కోరుతామని తెలియజేశారు.
Comments