జాతీయస్థాయి టైక్వాండో లో పతకాల పంట
రాజంపేట, డిసెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గోవాలో జరిగిన పదవ జాతీయస్థాయి టైక్వాండో యూత్ గేమ్స్ ఛాంపియన్ షిప్ 2022 పోటీలలో పట్టణానికి చెందిన "ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ" క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో పథకాలు సాధించారని అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ తెలిపారు. ఎనిమిది మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా ఎనిమిది మంది పతకాలు సాధించారని అన్నారు. నాలుగు స్వర్ణ పతకాలు, రెండు రజతం, రెండు కాంస్య పతకాలను క్రీడాకారులు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన వారిలో 35 కిలోల విభాగంలో డి. చరణ్ సహస్ర తేజ్, సి.గీతేష్ రెడ్డి లు స్వర్ణము, సీనియర్ విభాగంలో బి.సుజాత, టి.చంద్ర శేఖర్ లు స్వర్ణ పతకాలు సాధించగా కె.రమేష్, సుహాసిని లు రజతం, హర్షవర్ధన్ చౌదరి, వర్షిత లు కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలి
ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జి.ఎం.సి కల్యాణమంటపంలో క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఊటుకూరు ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ రెడ్డిమాసి రమేష్ నాయుడు పాల్గొని క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ క్రీడలను ఆదరించాలని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే మన ప్రాంత కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే సత్తా వారిలో ఉందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో క్రీడాకారులను సునీల్ మాస్టర్ తీర్చిదిద్దారని, వారికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఉపాధ్యక్షులు, విశాలాంధ్ర సీనియర్ పాత్రికేయులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, సంయుక్త కార్యదర్శి ఉమాశంకర్, కోశాధికారి ఏ.చంద్ర, గౌరవ సలహాదారులు టి.చంద్రశేఖర్, వర్ల నరసింహులు, కె. గంగారామ్, దుర్గయ్య, మార్కండేయ రాజు, మేడా చరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments